ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్‌డీ- కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు Poor Student Did PHD:పని చేస్తే కాని పూట గడవని కుటుంబ పరిస్థితుల నుంచి ఓ యువకుడు చదువును నిజమైన సంపదగా భావించాడు. ఫీజులు కట్టి చదువుకోవడం అసాధ్యం. అలాంటి పరిస్థిల్లో అతడు వెళ్లే దారిలో ఎన్ని సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. పట్టుదలతో చదివాడు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించాడు. అతడి సంకల్పంతో కర్ణాటక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ థావర్‌చంద్ గెహ్లోత్ నుంచి తెలుగు విభాగంలో పీహెచ్‌డీ పట్టాను పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా నిలిచాడు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం, గలగలా గ్రామానికి చెందిన కొత్తిమిరి చిదానంద నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి చిన్న వన్నూరప్ప కుటుంబంతో కర్ణాటక సరిహద్దు ప్రాంతం బళ్లారికి వలస వెళ్లి జీవనం సాగించారు. కొన్ని సంవత్సరాలకు చిదానంద కుటుంబాన్ని అతడి పెదనాన్న చేరదీయగా సొంత ఊళ్లోనే వ్యవసాయంపై ఆధారపడి జీవించారు.
'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం
చిదానంద ఊరికి పది కిలోమీటర్ల దూరంలో రెండో తరగతి చదివాడు. ఆ తర్వాత గ్రామాలలో పేదలకు, దళిత విద్యార్థులకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ చేయూత నిచ్చింది. పాఠశాల నుంచి డిగ్రీ వరకు ఆర్.డి.టీ సహకారంతో ఆయన చదువుకున్నాడు. ఇంటర్‌లో హిస్టరీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో సమస్యలు వచ్చి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. లెక్చరర్లు, మిత్రుని ప్రోత్సహంతో తన ప్రతిభను మెరుగుపరుచుకొని ఇంటర్ పాసయ్యాడు.
డిగ్రీ చేయడానికి డబ్బులులేక చిదానంద కూలి పనికి వెళ్లి ఆ డబ్బుతో డిగ్రీ అప్లై చేశాడు. అక్క, మామ ఇంట్లో ఉంటూ ఉదయం వేళ పేపర్‌బాయ్‌గా మారాడు. మధ్యాహ్నం మెడికల్ షాపులో పని చేస్తూ చదువు కొనసాగించాడు. కళాశాల సెలవుల్లో ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పని చేశాడు. చిన్న, చిన్న పనులు చేస్తూ డిగ్రీను పూర్తి చేశాడు.
డిగ్రీ పూర్తయ్యాక చిదానంద బీఈడీ చేయాలని అనుకున్నాడు. ఒక ప్రొఫెసర్ సూచన మేరకు తన దారి మార్చుకున్నాడు. మంచి భవిష్యత్తు కోసం కొత్త ప్రదేశానికి బయల్దేరాడు. బెంగళూరు యూనివర్సిటీలో తెలుగు విభాగంలో పీజీ కోర్సులో చేరాడు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రొఫెసర్లు పూర్తి సహకారం అందించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని చిదానంద పీజీ పూర్తి చేశాడు.
యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు
చిదానందను పీహెచ్‌డీ చేయాలనే కోరిక వెంటాడింది. ఈ తరుణంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండ హోటల్‌లో సర్వర్‌గా చేరాడు. కోర్సులో చేరాక ఆర్టికల్స్ రాయడంలో సమస్యలు ఎదుర్కొన్నాడు. తన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కృషితో 'ఆచార్య కొలకలూరి ఇనాక్ నాటక సాహిత్యం- ఒక పరిశీలన' అనే అధ్యయాన్ని పూర్తి చేశాడు. విజయవంతంగా చదువు పూర్తి చేసిన అతడు పీహెచ్‌డీ పట్టా సాధించాడు.
పీహెచ్‌డీ పూర్తి చేసిన యూనివర్సిటీలోనే చిదానంద గెస్ట్ ఫ్యాకల్టీగా చేరాడు. తెలుగు చదువుకునే విద్యార్థులు తక్కువ ఉండడంతో తెలుగు కోర్సు అందుబాటులో ఉండట్లేదని అతడు చెబుతున్నాడు. ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లో తెలుగు విభాగంలో అవకాశాలు ఉన్న విషయం ఎక్కువ మందికి తెలియదు. తెలుగుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను తాను ప్రోత్సహిస్తానని తెలియజేశాడు.
చిన్న వయస్సు నుంచి కష్టాల కొలిమిలో పదును తేలాడు. అతనికి ఎదురైన సమస్యలను చూసి భయపడకుండా పోరాడాడు. ఈ మధ్య కాలంలో అన్ని అవకాశాలు ఉండీ కొంతమంది చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా తన చదువును ఆపకుండా కర్ణాటక గవర్నర్ నుంచి తెలుగు విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందిన చిదానంద ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.
అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్