అనంతపురం జిల్లాలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి... ఏ సంస్థలు ముందుకు వస్తున్నాయనే స్పష్టత లేకుండానే ఏపీఐఐసీ అధికారులు రైతులను కంటితడి పెట్టిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాచానుపల్లి గ్రామంలో 742 సర్వే నెంబర్లో 94 ఎకరాల భూమి ఉంది. దీనిలో కొంత అటవీ, మరికొంత ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్ భూమిలో ఎవరూ సాగు చేసుకోని 60 ఎకరాల విస్తీర్ణాన్ని రెవెన్యూ అధికారులు ఏడాది కిందటే కొలతలు వేసి పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించారు.
ఆ సంస్థ భూమిని చదును చేసి అంతర్గత రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తయ్యాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గజాల చొప్పున విక్రయిస్తారు. ఇప్పటికే 60 ఎకరాల భూమిని తీసుకున్న ఏపీఐఐసీ అధికారులు... దానిలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టలేదు. ఈ భూమిని ఎంతమంది పారిశ్రామిక వేత్తలకు విక్రయించారు..? వారు ఏ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు.
ఇప్పటికే సేకరించిన 60 ఎకరాల భూమిని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయని ఏపీఐఐసీ అధికారులు... అదే సర్వే నెంబర్లోని మరో 30 ఎకరాలు సేకరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు సేకరించిన 60 ఎకరాల భూమి కొండలు, గుట్టల మయంగా ఉండి రైతులు ఎవరూ సాగుచేయటంలేదు. 4 దశాబ్దాల కిందట కొందరు పేద రైతులకు ప్రభుత్వం 37 ఎకరాల వరకు భూమి పంపిణీ చేసింది. కొండలు, గుట్టలతో నిండిన ఆ భూమిని పేద రైతులు ఏళ్ల తరబడి బాగు చేసుకుంటూ... సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు.