తాడిపత్రి మున్సిపల్ రాజకీయం ఎత్తులు పైఎత్తులతో రంజుగా మారింది. ఈ నెల 18న మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉండటంతో.... పీఠంపై కూర్చుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 18 వార్డులు గెలుచుకున్న తెలుగుదేశం. .. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకేనని ధీమాగా ఉంది. వీరితో కలిసి 20 మంది బలం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఓటు కూడా కలిసొస్తుందని భావించింది. అలాగే 16 వార్డులు దక్కించుకున్న వైకాపాకు ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో 18 ఓట్ల బలం ఉన్నా... పీఠం దక్కాలంటే మరొకరి మద్దతు అవసరం. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీల ఓట్లను ఉపయోగించుకోవాలని అనుకుంది. అయితే ఎక్స్ అఫిషియో ఓటు కోసం ప్రయత్నించిన ఎమ్మెల్సీలెవరూ... తాడిపత్రిలో ఓటు వేసేందుకు అర్హులు కాదని అధికారులు తేల్చారు.
ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన వార్డు సభ్యులను కాపాడుకునేందుకు.... వారందర్నీ శిబిరానికి తరలించింది. ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న వైకాపా... తెలుగుదేశం కౌన్సిలర్లపై గురిపెట్టింది. ఈ క్రమంలోనే 21వ వార్డు కౌన్సిలర్ తండ్రి, టాటా సర్వీస్ కేంద్రం నిర్వాహకుడు మనస్తాన్ వలీని బెదిరించినట్లు తెలుగుదేశం ఆరోపించింది. వలీ కుటుంబం నుంచి 21, 23, 25 వార్డుల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైకాపాలో చేరాలని ఒత్తిడి చేసినట్లు తెలుసుకున్న నియోజవర్గ తెులుగుదేశం ఇన్‌ఛార్జి జేసీ అస్మిత్‌రెడ్డి... అనుచరులతో వెళ్లి వలీకి ధైర్యం చెప్పారు.