అనంతపురం జిల్లాలో నిత్యం విధుల్లో ఉంటూ.. ప్రజలతో మమేకమైన ఎందరో పోలీసులు వైరస్ బారిన పడ్డారు. వారంతా ధైర్యంగా ఎదుర్కొని, తిరిగి విధుల్లో చేరారు. కుటుంబ సభ్యుల తోడ్పాటు, వైద్యుల సూచనలు, సలహాలతో కోలుకున్నట్లు తెలిపారు. పోలీసు అధికారుల స్వీయ అనుభవాలు వారి మాటల్లోనే.
అప్రమత్తంగా ఉన్నా..
కరోనా సోకినప్పుడు ప్రారంభ దశలోనే తెలుసుకుంటే సులువుగా ఇంటి వద్ద ఉంటూ నయం చేసుకోవచ్ఛు ఎలాంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. వైరస్ సోకిందని తెలియగానే భయమేస్తుంది. కానీ వ్యాధి లక్షణాలు, తీవ్రతను బట్టి కోలుకోగలమనే ధైర్యాన్ని నింపుకోవాలి. విధి నిర్వహణలో బయట తిరగడంతో నాకు వైరస్ సోకింది. కానీ లక్షణాలు కనిపించలేదు. మా ఇంటిలో చిన్నారికి జర్వం రావడంతో అనుమానం వచ్చి పరీక్ష చేయించాను. పాజిటివ్ అని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులందరూ పరీక్షలు చేయించుకోగా.. నాకు పాజిటివ్ వచ్చింది. ప్రారంభ దశలోనే ఉందని తెలుసుకొని హోమ్ ఐసొలేషన్‌లో ఉంటూ వైద్యుడి సలహా మేరకు మందులు తీసుకున్నాం. మందులు తీసుకుంటుండగానే నాలుగో రోజు రుచి, వాసన పోయాయి. అయినా ధైర్యం కోల్పోలేదు. ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నాం. ఎవరికైనా అనుమానం కలిగితే నేరుగా కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిది. రోజూ 5 లీటర్ల నీటిని తాగాలి.. ఆవిరి పట్టుకోవాలి. - శేఖర్, సీఐ, కొవిడ్ ప్రత్యేక విభాగం
వైద్యుల సలహాలు పాటించా..
బాధితులు ముఖ్యంగా మనోధైర్యంతో ఉండాలి. వైరస్ సోకిందని తెలియగానే మానసికంగా కుంగిపోవద్ధు. గుండె నిబ్బరం చేసుకుని చికిత్స గురించి ఆలోచించాలి. అనుమానం రావడంతో నేను కరోనా పరీక్ష చేయించుకున్నా. అందులో పాజిటివ్ వచ్చింది. తొలుత ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాను. వైద్యులు ఆక్సిజన్ స్థాయి, బీపీ, షుగర్‌ను తరచూ పర్యవేక్షించారు. ఐదు రోజుల్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. మరో 10 రోజులపాటు ఇంటిలోనే ఉంటూ వైద్యుడి సలహాల మేరకు మందులు తీసుకున్నాను. గొంతును రోజూ రెండు పర్యాయాలు ద్రావకంతో పుక్కిలించడం చేశా. పౌష్టికాహారం తీసుకున్నా. క్రమం తప్పకుండా మాత్రలు వాడాను. ధైర్యంతోనే మహమ్మారిని జయించా. - మురళీధర్‌రెడ్డి, సీఐ, అనంత గ్రామీణం