Police Stopped Payyavula Keshav in Anantapur District :సాగునీటి కోసం అనంత రైతులు రోడ్డెక్కారు. కనీసం ఒక్క తడి ఇవ్వమంటూ కదం తొక్కారు. లేదంటే 300 కోట్ల రూపాయల విలువైన పంటలు కోల్పోతామని ఆందోళన వెలిబుచ్చారు. ఆ పరిస్థితి వస్తే మూకుమ్మడిగా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ వాపోయారు. రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం వారికి మద్దతుగా గళమెత్తిన పయ్యావుల కేశవ్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకుని చేతులు దులుపుకుంది.
'కేవలం ఒక్క తడికి నీళ్లడుగుతున్నా సర్కారుకు మనసు రావడం లేదు' - రైతులతో కలిసి పయ్యావుల ఆందోళన
Anantapur Farmers Protest For Water Source to Crops : గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు 30 వేల ఎకరాల్లో మిరప, జొన్న, పత్తి, వేరుశనగ పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ ముష్టూరు వద్ద రోడ్డుపై బైఠాయించారు. రైతులకు మద్దతుగా తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తోపాటు జనసేన, వామపక్ష నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి పెట్టామని ఒకట్రెండు తడుల నీళ్లిస్తే చివరిదశలో ఉన్న పంటలను కాపాడుకుంటామని వేడుకున్నారు. స్థానికంగా పంటలు ఎండుతుంటే నీళ్లివ్వకుండా మంత్రి పెద్దిరెడ్డి గొప్పల కోసం హంద్రీనీవా ద్వారా పుంగనూరుకు నీటిని తరలించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.