ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. రాష్ట్రంలో పలుచోట్ల తనిఖీలు - ఎస్​ఈబీ అధికారులు తాజా వార్తలు

ఎన్నికల తనిఖీల్లో భాగంగా మద్యం అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి సారించారు. అక్రమంగా డబ్బు మద్యం రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్​లు చేస్తున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడినా, డబ్బు అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

police inspection on  illegal liquor transportation
అక్రమ మద్యం రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

By

Published : Feb 4, 2021, 9:35 PM IST

ఎన్నికల్లో అక్రమంగా మద్యం రవాణాకు పాల్పడుతున్న వారిపై పోలీసులు దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పట్టుబడిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా మైలవరంలో భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. ఎన్నికల వేళ వాహనాల తనిఖీలో భాగంగా మైలవరంలోని ఓ కళాశాల వద్ద ఉన్న సర్కిల్​లో రెండు కార్లలో అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు. నిందితుల నుంచి 1405 బాటిళ్ల మద్యం, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల సమయంలో ఎవరైనా మద్యం అక్రమ రవాణాకు పాల్పడినా, డబ్బు అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

కర్ణాటక మద్యం, నాటుసారాపై ప్రత్యేక నిఘా..

అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక మద్యం రవాణా, నాటు సారా తయారీ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా సెబ్ ఎస్పీ నారాయణ స్వామి తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎస్​ఈబీ పరిధిలో 1200 మంది పాత నేరస్థులను బైండోవర్ చేసినట్లు చెప్పారు. మద్యం అక్రమ రవాణాపై శాశ్వతమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో..

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన దాడుల్లో భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం సమీపంలో రవాణా చేస్తున్న 12 వందల లీటర్ల సారాను ఎస్​ఈబీ అధికారులు వెంటాడి పట్టుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగొడవ గ్రామ సమీపంలో ఎస్​ఈబీ అధికారులు భారీగా నాటుసారా నిల్వలను పట్టుకున్నారు. సహాయ సూపరిండెంట్ శ్రీనాథుడు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. బొలెరో వాహనంలో రవాణా చేస్తున్న 1200 లీటర్ల సారాను వెంటాడి పట్టుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరులో కర్ణాటక మద్యం పట్టివేత..

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల విలువైన కర్ణాటక మద్యం పాకెట్లను ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం బూచుపల్లి వద్ద మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో కాపుకాసి పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం పాకెట్లతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడులు

ABOUT THE AUTHOR

...view details