ఈ నెల 9న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని పెద్దవరం, చెరువుకొమ్ముపాలెం, లింగాల పాడులో పోలీసులు కవాతు చేశారు. సీఐ కనకారావు ఆధ్వర్యంలో.. వీధుల్లో ప్రదర్శనగా వెళ్లారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 17న జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. అవనిగడ్డ మండలం నాగాయలంక మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో..
చంద్రగిరి మండలంలో పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. వెస్ట్ డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో సీఐ రామచంద్రారెడ్డి అధ్యక్షతన దాదాపు వందమంది పోలీసులు ప్రదర్శనగా వెళ్లారు. చంద్రగిరి పట్టణంలోని ప్రధాన వీధులతోపాటు మండలంలోని మరో నాలుగు నామినేషన్లు వేసే ప్రాంతాలలో ఈ కవాతు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా... స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ కవాతు అన్నారు. సీఐ శివప్రసాద్ తో పాటు మరో నలుగురు ఎస్సైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎస్సై జి సురేంద్ర తెలిపారు. ఎవరైనా ఓటర్లను బెదిరిస్తే అలాంటి వ్యక్తుల సమాచారం తమకు అందించాలని కోరారు. ప్రశాంత వాతావరణానికి ఎవరైనా భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన పోతవరం నరేంద్రపురం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి:
తొలి దశలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. చిత్తూరులోనే అత్యధికం