అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత హత్య ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు రాజేశ్, కార్తీక్‌ను అరెస్టు చేసిన ధర్మవరం గ్రామీణ పోలీసులు.. వారి వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజేశ్‌ను ఘటనాస్థలికి తీసుకెళ్లి పరిశీలించారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
హత్యకు గురైన యువతి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తమ కుమార్తె కనిపించటం లేదని అనంతపురం ఒకటోపట్టణ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని స్నేహలత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను... ఎస్సీ సంఘం నేతలు అడ్డగించారు. కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
త్వరితగతిన నేర విచారణ
యువతులు, మహిళలపై అత్యాచార ఘటనలపై ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని.. హోం మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటుతోనే త్వరితగతిన నేర విచారణ జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం దిశ చట్టం కింద నిందితులకు త్వరితగతిన శిక్షలు కఠిన శిక్షలు విధిస్తున్నామని చెప్పారు. దిశ చట్టం కింద చిత్తూరు, విజయవాడల్లో నేరానికి పాల్పడిన వారికి ఉరి శిక్షలు అమలయ్యాయయని.. రాష్ట్రంలో మరో 20 కేసుల్లో నేరస్థులకు జీవిత ఖైదు పడిందని హోం మంత్రి అన్నారు.