అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్క రోజు పోలీసు కస్టడీ ముగిసింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఈ నెల 6న బెయిల్పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని తాడిపత్రిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 7వ తేదీన ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసి కడప కారాగారానికి రిమాండుకు తరలించారు.
ఈ కేసులో ఆయనను విచారించేందుకు పోలీసులు కోర్టును కస్టడీ కోరగా న్యాయమూర్తి ఒక్కరోజు అనుమతి ఇచ్చారు. దీంతో తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని కడప జైలు నుంచి అనంతపురం తీసుకొచ్చారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో సుమారు 3 గంటలకు పైగా ప్రభాకర్ రెడ్డిని విచారణ చేశారు.