అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి పెన్నానదిలోకి వెళ్లే భూగర్భ డ్రైనేజీకి సంబంధించి సీపీఐ కాలనీలోని మురుగునీటి శుద్ధి కేంద్రం పైపులైన్లు నెల కిందట దెబ్బతిన్నాయి. కొత్త పైపులైన్ ఏర్పాటుకు రూ.2లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. మున్సిపాలిటీ తరఫున అన్ని నిధులు ఖర్చు చేయలేమని అధికారులు చెప్పడంతో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (తెదేపా) సొంత నిధులు వెచ్చించడానికి ముందుకొచ్చారు. స్థానిక గుత్తేదారు మల్లికార్జునరెడ్డికి పనులు అప్పగించారు. శనివారం పనులు ప్రారంభిస్తుండగా ఎమ్మెల్యే కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా పనులెలా చేస్తారంటూ గుత్తేదారుపై భౌతిక దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన 32వ వార్డు తెదేపా కౌన్సిలర్ మల్లికార్జునను కొట్టారు. కిందపడేసి తన్నడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్ ఎర్రిస్వామిపైనా దాడి చేశారు. తాను విలేకరినని చెప్పినా వినిపించుకోలేదు. సెల్‌ఫోన్ లాక్కొని.. ‘మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా’? అంటూ కులం పేరుతో దూషిస్తూ హర్షవర్ధన్‌రెడ్డి స్వయంగా దాడి చేశారు. ఎర్రిస్వామి చెవికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా కనీసం స్పందించలేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్సనందించి అనంతపురంలోని సర్వజనాసుత్రికి తరలించారు. ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్షవర్ధన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు గ్రామీణ సీఐ చిన్నపెద్దయ్య తెలిపారు.