Insurance Claim with Fake Certificates: వాళ్లంతా వివిధ పనులు చేసుకుంటూ ఉండేవారు. అంతా ఒక్కటయ్యారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ఏకంగా బతికున్న వారినే.. చనిపోయినట్టు సృష్టించడం మొదలుపెట్టారు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా చేసేవారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తులు బతికి ఉండగానే.. చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్, ఫోటోలు మార్పిడి చేసిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లతో ఇన్సూరెన్స్ డబ్బులు క్లైమ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠా వద్ద నుంచి కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు తాడిపత్రి డీఎస్పీ చైతన్య పేర్కొన్నారు. తాడిపత్రిలోని హరిజనవాడకు చెందిన గిత్త రంగనాయకులు.. ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసేవాడు. శాంతమ్మ అనే మహిళకు 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసి.. కంపెనీని మోసం చేశాడు. శాంతమ్మ బతికుండగానే.. మృతి చెందినట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించి డబ్బులు కాజేశాడు.
ఇన్సూరెన్స్ అధికారుల విచారణలో భాగంగా రంగనాయకులు అనే వ్యక్తికి ఫోన్ చేయగా.. అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో సచివాలయానికి వెళ్లి విచారణ చేశారు. విచారణలో శాంతమ్మ అనే మహిళ బతికే ఉందని.. డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో ఏజెంట్ ఇలా చేశాడని ఇన్సూరెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో సదరు ఇన్సూరెన్స్ అధికారులు తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.