బంజరు భూమిలో ప్రకృతి వ్యవసాయం ద్వారా బంగారు పంటలు పండిస్తున్న రాష్ట్ర మహిళను సాక్షాత్తూ దేశ ప్రధాని అభినందించారు. ఓ గ్రామీణ మహిళ ప్రకృతి వ్యవసాయంలో రాణించడంపై ఆనందం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ... ఆమెతో నేరుగా మాట్లాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంటలో వన్నూరమ్మ అనే ఎస్సీ మహిళా అధికారుల సూచనలతో రెండేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టింది. తన కుటుంబ సభ్యుల సహకారంతో ప్రకృతి వ్యవసాయం చేపట్టడంతో కేవలం రూ. 27 వేలు పెట్టుబడితో రూ. 1.07 లక్షలు ఆర్జించింది.
వర్షాభావ పరిస్థితులతో బీడువారిన తన రెండెకరాల పొలంలోనే సహజ పద్ధతుల్లో నవధాన్యాలు, కాయగూరలు సాగు చేసింది. ఏడాది తిరిగేసరికి మంచి లాభాలు సాధించడం సహా.. మరో 220 ఎకరాల్లో స్థానిక గిరిజన మహిళల వ్యవసాయానికి తోడ్పాటునందించింది. వన్నూరమ్మ కృషిని గుర్తించిన ప్రభుత్వ అధికారులు ఇటీవల ప్రధానమంత్రి మోదీతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆమె విజయాన్ని వివరించారు. వన్నూరమ్మ సాగు పద్ధతులను స్వయంగా అడిగి తెలుసుకున్న ప్రధాని.. ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశ ప్రధాని తనతో మాట్లాడడం గర్వంగా ఉందని వన్నూరమ్మ సంతోషం వ్యక్తం చేశారు.