ఈ ఏడాది ఖరీఫ్‌లో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఏటా ఆగస్టులో నీరు విడుదల చేయటం, వరి పంట కీలక దశలో ఉన్నపుడు నీటిని నిలిపివేసేవారు. తాగునీటి అవసరాల నిమిత్తం ఆయకట్టుకు పరిమితంగా నీరిచ్చే పద్దతిని అధికారులు ఆచరిస్తూ వచ్చారు. అయితే ఈసారి టీబీ డ్యాంకు ఎగువన మంచి వర్షాలు కురవటంతో కేవలం రెండు రోజుల్లోనే జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని జూలై లో హెచ్చెల్సీ కాలువకు విడుదల చేశారు.
ఈ నీటిని జిల్లాలో ప్రధాన తాగునీటి జలాశయాలు పీఏబీఆర్, ఎంపీఆర్లకు మళ్లించారు. నెల రోజులుగా హెచ్చెల్సీ ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తనం ఈ రెండు జలాశయాల్లో ఐదు టీఎంసీల నీరు నిల్వచేశారు. జిల్లాకు గత ఏడాది హెచ్చెల్సీ ద్వారా 27 టీఎంసీల రాగా, ఈసారి టీబీడ్యాం ముందుగానే నిండినందున 29 టీఎంసీలు వస్తుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తుంగభద్ర జలాశయానికి సీజన్ లో 198 టీఎంసీల వరద వస్తుందని అంచనా వేసిన టీబీ బోర్డు అధికారులు కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ లోని కాలువల ద్వారా 168 టీఎంసీలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. నీటి వినియోగంపై జిల్లాల వారీగా సాగునీటి సలహా సంఘం సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు.