Sake Bharathi Comments on MLA Padmavathi: ‘కులం చూడం. మతం చూడం. ఏ పార్టీ అనేది చూడం. అర్హులైతే చాలు... పథకాలు వర్తింపజేస్తాం’.. ఎక్కడ సభ జరిగిన ముఖ్యమంత్రి జగన్ తరచూ చెప్పే మాట ఇది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆయన పార్టీ ఎమ్మెల్యేలే ఈ మాటలను పెడచెవిన పెడుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నాగులగూడెం గ్రామానికి చెందిన పీహెచ్‌డీ పట్టాదారు, గిరిజన కూలీ సాకే భారతి కుటుంబానికి జరిగిన అన్యాయమే ఇందుకు ఉదాహరణ.
ఇల్లు కట్టుకునే స్థోమత లేక రేకులనే అడ్డుపెట్టుకొని జీవనం సాగిస్తున్న ఆ పేదకుటుంబానికి అన్ని అర్హతలున్నా ఇల్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కలిసి ఇల్లు మంజూరు చేయాలని ప్రాధేయపడితే గెంటేశారు. తాను ఉన్నత విద్య చదివానని, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారని, ఓ సిఫార్సు లేఖ ఇవ్వాలని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.
కష్టపడితినే తిండి: సాకే భారతి, శివప్రసాద్ దంపతులది నిరుపేద కుటుంబం. వారిద్దరూ కూలినాలి చేసుకొని రోజువారి జీవనం సాగిస్తున్నారు. చదువు కోసం ఎదురైన కష్టాలన్నింటిని అధిగమించిన భారతి.. పీజీ వరకూ చదివి డాక్టరేట్ అందుకున్నారు. వీరికి ఎనిమిది సంవత్సరాల కూతురు ఉంది. భర్త సహకారంతో భారతి రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవాల్లో పట్టాను అందుకున్నారు. ఒక నిరుపేద గృహిణి.. కూలి పనులకు వెళితేగాని పూట గడవని పరిస్థితుల్లో పీహెచ్‌డీ పట్టా పొందడంతో... ఒక్కసారిగా భారతికి ప్రశంసలు వెల్లువెత్తాయి. అభినందించేందుకు వెళ్లిన పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు భారతి కుటుంబ పరిస్థితులు, ఉంటున్న ఇంటిని చూసి షాక్ అయ్యారు.
ఈ క్రమంలో ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన భారతి.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై పలు ఆరోపణలు చేశారు. 'నా భర్త శివప్రసాద్‌తో కలిసి సంవత్సరంన్నర కిందట ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇంటికి వెళ్లాం. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నా.. అక్కడ బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. మీరు చెబితే ఇస్తారని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకొని వేడుకున్నాం. పూర్తి వివరాలు రాసివ్వాలని కోరితే ఆ మేరకు రాసి ఇచ్చాం. తెల్లారి నా భర్త ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే.. బయటకు గెంటించారు. వాళ్లు అలా ఎందుకు చేశారో మాకు తెలియదు. తల దాచుకోవడానికి ఇల్లు అడిగినా పట్టించుకోలేదు’ అని భారతి ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నాయకుల ఒత్తిళ్లు:ఎమ్మెల్యే పద్మావతిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని మీడియాకు చెప్పాలని సాకే భారతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే సాయం చేశారని చెప్పాలని అడుగుతున్నట్లు తెలిస్తోంది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భారతికి ప్రశంసలు వెల్లువెత్తుతూ.. సన్మానాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కనీసం అభినందించకపోవడం గమనార్హం.