Petrol Attack on Couple: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తిని తాగొద్దని చెప్పినందుకు.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన చుక్కలూరు పారిశ్రామిక వాడలో చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే ఫ్యాక్టరీలో రమేష్ రెడ్డి కూడా పని చేస్తున్నాడు. తాడిపత్రికి చెందిన నల్లపురెడ్డి, రమేష్ రెడ్డి దగ్గరి బంధువులు. వరసకు అన్నదమ్ములు అవుతారు. కాగా రమేష్ రెడ్డి నిత్యం మద్యం సేవించి వచ్చి.. తన భార్యతో గొడవ పడేవాడు. దీంతో మద్యం తాగొద్దని రమేష్ రెడ్డిని నల్లపురెడ్డి మందలించాడు. దీంతో నల్లపురెడ్డిపై రమేష్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు.
శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై అంతా నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున అనే వ్యక్తి కుమార్తె కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో రమేష్ రెడ్డి.. నల్లపురెడ్డి, కృష్ణవేణిపై పెట్రోల్ పోశాడు. వెంటనే మెలకువ వచ్చిన కృష్ణవేణి ఏం చేస్తున్నావ్ అని అడిగేలోగా రమేష్ రెడ్డి నిప్పు అంటించాడని వారు తెలిపారు.
ఈ ఘటనలో దంపతులు ఇద్దరికీ తీవ్ర గాయలయ్యాయి. పక్కనే నిద్రిస్తున్న బాలికకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రమేష్ రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని.. అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, కృష్ణవేణి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహ్మద్‌కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు.
కృష్ణవేణి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. స్వల్ప గాయాలైన బాలికను తాడిపత్రి ఆసుపత్రిలోనే చికిత్స అందించి ఇంటికి పంపించారు. దీనిపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.