PET DOG BITE RAILWAY EMPLOYE: రెండు తెలుగు రాష్ట్రాలను కుక్కలు హడలెక్కిస్తున్నాయి. వీధి కుక్కల బారినపడి ఇప్పటికే ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో వీధి కుక్కల బారిన పడి పలువురు తీవ్ర గాయాల పాలవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పెంపుడు కుక్క.. ఏకంగా సొంత యజమానిపై దాడి చేసి ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. నాలుగు సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడి.. కన్న బిడ్డలా పెంచిన యజమానిపై తిరగబడి రక్తం కళ్లచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇదీ జరిగింది..
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో బెంచి కొట్టాల ప్రాంతంలో ఉన్న రైల్వే గార్డు నాగరాజు నాలుగు సంవత్సరాల క్రితం రాట్ వీలర్ అనే జాతికి చెందిన కుక్కను ఇంటికి తెచ్చుకున్నాడు. ఎంతో మురిపంగా దానికి 'లక్కీ' అని పేరు పెట్టాడు. నాలుగు సంవత్సరాలు కన్న బిడ్డలతో సమానంగా పెంచాడు. నిన్న డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే తన పెంపుడు కుక్క 'లక్కీ' తలపై నిమిరేందుకు యత్నించాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ వెంటనే ఆ కుక్క అతడిపై దాడి చేసి గొంతు కొరికేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన నాగరాజు తన కుడిచేయిని అడ్డుగా పెట్టుకున్నాడు. దీంతో ఆ కుక్క.. అతడి కుడిచేయిని పట్టుకుని సుమారు 15 నిమిషాలు విడవకుండా దాదాపుగా 150 గాట్లు పడేలా కొరికి గాయపర్చింది.
తీవ్ర రక్తస్రావమై గాయాల పాలైన అతడు లక్కీ భారి నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. తాను విడిపించుకునేందుకు యత్నిస్తే మరోసారి గొంతు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుందేమో అనే భయంతో.. చేతిని కోరుకుతూ ఉన్నా అలాగే పెనుగు లాడాడు. అంతలోనే అక్కడికి చేరుకున్న అతని భార్య లక్కీ .. అలా చేయకూడదు.. బయట పిల్లి వచ్చింది వెళ్దాం రమ్మంటూ.. కుక్కను పది నిమిషాలపాటు నచ్చజెప్పి పలుమార్లు పిలిచి దృష్టి మారల్చించేందుకు యత్నించింది.
దీంతో కొద్ది సేపటి తర్వాత ఆ శునకం మెల్లిగా పట్టు సడలించింది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్న నాగరాజు గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. వెంటనే కుక్కను కట్టివేసిన అతని భార్య నేరుగా.. తీవ్ర రక్తస్రావం అవుతున్న నాగరాజును తీసుకొని రైల్వే ఆసుపత్రికి తీసుకుని వెళ్లింది. తీవ్ర గాయాల పాలైన నాగరాజుకు 25కి పైగా ఇంజక్షన్లు వేసి వైద్యులు చికిత్స అందించారు. ఇంకా వాపు అలాగే ఉండటంతో రైల్వే వైద్యులు పర్యవేక్షణలో నాగరాజుకు చికిత్స కొనసాగిస్తున్నారు.