ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్పందన' కరవు.. పరిష్కారం కాకపోయిన అయినట్లు సందేశాలు - స్పందన కార్యక్రమం

Spandana Program : అక్కడ ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య.. ఒకసారి రెండు సార్లు కాదు.. తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్నాయే కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. అలాగని అదేదో చిన్నాచితకా ఆఫీసు కాదు.. ఏకంగా కలెక్టర్‌ కార్యాలయం.. కలెక్టర్‌కు మొర పెట్టుకున్నా సమస్య తీరడం లేదని జనం వాపోతున్నారు. అనంతపురం జిల్లాలో స్పందన పేరుతో ఏర్పాటైన కార్యక్రమంలో స్పందనే కరవైందని బాధితులు వేదన చెందుతున్నారు.

No Solution In Spandana
No Solution In Spandana

By

Published : Sep 20, 2022, 12:30 PM IST

No Solution In Spandana Program : అనంతపురం జిల్లాల్లో ప్రజా ఫిర్యాదులు పరిష్కారం కావటం లేదు. ప్రతి సోమవారం కలెక్టర్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినా.. కిందిస్థాయి అధికారుల నుంచి కనీస స్పందన ఉండటం లేదు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కలెక్టర్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులకు కచ్చితమైన ఆదేశాలు వెళ్లినా.. సమస్యలు మాత్రం పరిష్కారం కావటంలేదు. భూములకు సంబంధించిన సమస్యలైతే రెవెన్యూ అధికారులు, సిబ్బంది రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖల అవినీతిపై స్పష్టమైన సమాచారంతో ఇచ్చే ఫిర్యాదులపై కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించి కింది స్థాయి అధికారులకు హెచ్చరికలు చేయని పరిస్థితి నెలకొంది. సమస్యను పరిష్కరించకుండానే మీ సమస్య పరిష్కారం అయిందని మొబైళ్లకు సందేశాలు వెళ్తున్నాయి.

జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు..రోజూ గ్రామ సచివాలయాలు, ఇతర కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఫిర్యాదుదారులు కలెక్టర్ స్పందనలో అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిదటనేదే అర్థంకాని ప్రశ్న. రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పరిష్కారం చేయగలిగిన సమస్యలపైనా ప్రజలు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.

స్పందన కార్యక్రమంలో ఎక్కువగా భూముల సమస్యలపైనే ఫిర్యాదులు వస్తుంటాయి. భూమి ఆక్రమించారని, కొనుగోలు చేసిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వటంలేదని, వెబ్ ల్యాండ్ లో మ్యుటేషన్ చేయటంలేదని ఇలా వందలాది ఫిర్యాదులు రెవెన్యూ శాఖవే ఉంటున్నాయి. గ్రామసచివాలయ వ్యవస్థ వచ్చినప్పటికీ గ్రామాల్లో భూమి సర్వే చేయటానికి సిబ్బంది వెళ్లటంలేదని కలెక్టర్ వద్దకు వచ్చే బాధిత రైతుల ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. కలెక్టరేట్‌కు వస్తున్న బాధితులను ఎవరిని కదిలించినా అనేక సార్లు వచ్చినా సమస్య పరిష్కారం కావట్లేదంటున్నారు.

జిల్లా అధికారులు మొక్కుబడిగా క్షేత్ర పర్యటనలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సమస్య పరిష్కరించామని కింది స్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని కనీసం పరిశీలన చేయకుండానే ప్రభుత్వానికి నివేదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు పరిష్కారం కాక బాధితులు వ్యయ, ప్రయాసలకు గురవుతున్నారు.

స్పందన కార్యక్రమంలో స్పందన కరవు.. పరిష్కారం కాకపోయిన అయినట్లు మొబైళ్లకు సందేశాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details