water problem in Anantapur: ప్రజా ప్రతినిధులు, అధికారులు తాగునీటి సరఫరాను మెరుగు పరుస్తున్నామని.. ఇంటింటికి తాగునీటి కొళాయిని అందిస్తున్నామని చెప్తున్నారు. కాని ఆచరణలో మాత్రం అడుగుపడటం లేదు. అధికారుల మాటలకు పొంతన లేకుండా పోతోంది. ప్రజలు బిందెడు నీటి కోసం.. బండెడు కష్టాన్ని పడాల్సి వస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో శివరామిరెడ్డి కాలనీలో.. వైసీపీ ఎమ్మెల్సీగా శివరామిరెడ్డి ప్రస్తుతం పట్టణంలో నివాసం ఉన్నారు. ఏనాడు కాలనీల ప్రజలు సమస్యలను విన్నది లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరామిరెడ్డి కాలనీలో 400 వరకు నివాస గృహాలు ఉన్నాయి. 2 వేల వరకు జనాభా ఉన్నారు. మరో మూడు కాలనీల్లో ఒకటి రెండు చోట్ల పబ్లిక్ కొళాయిలు ఉన్నాయి. వాటికి నాలుగైదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయి. అవి కూడా ఓ అరగంటకు మించి రాని పరిస్థితి. నిత్యం కూలీనాలీ చేసుకునే స్థానికులు ఆ నీటిని పట్టుకోవడానికి పడే ఇబ్బందులు వర్ణానాతీతం. ఒక్కో కుటుంబానికి ఐదు లేదా ఆరు బిందెల నీళ్లు దొరకడం కూడా కష్టమే. వాటినే మూడు నాలుగు రోజులు వాడుకోవాలి.
కొళాయిలకు నీరు సరఫరా అయినపుడు వచ్చిరాని నీటిని పట్టుకోవడానికి స్థానిక మహిళల మధ్య పెద్ద 'కన్నీటి' యుద్ధమే చోటు చేసుకుంటుంది. గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ అలాంటి పరిస్థితి తీవ్రం అవుతోంది. దీనిని చూస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు మాటలతో సరి పెడుతున్నారు. ఆ కాలనీ జనాలకు తగినట్లుగా పైపులైన్లు నిర్మించడం గాని.. కొళాయిలను ఏర్పాటు చేయడం గాని చేయలేదు. నీటి కోసం ఎలాంటి శాశ్వత చర్యలు చేపట్టిన పాపాన పోలేదని కాలనీ ప్రజలు వాపోతున్నారు. నిత్యం అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం నీటి సరఫరాను మెరుగు పరిచామని, ఎక్కడ సమస్య ఉన్నా ఇట్టే తీరుస్తామన్నట్లు ప్రకటనలు చేస్తున్నారని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కాలనీల్లో మాత్రం నీటి సమస్యను పరిష్కరించక పోగా.. స్థానికులు దానిని అధికారులు దృష్టికి తెచ్చినా పట్టించుకునే వారు లేరు.