ఓవైపు కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్నివర్గాలు కుదేలయ్యాయి. మరోవైపు ఇంధన ధరలు పెనుభారంగా మారాయి. పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం రవాణా రంగంపై చూపుతోంది. నెలరోజుల్లో లీటరు డీజిల్‌పై రూ.9.64, పెట్రోలు రూ.8.34 పెరిగింది. దీంతో సరకు రవాణా వాహనాలకు 10 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఎగుమతులు కష్టమే
ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులకు జిల్లా పెట్టింది పేరు. గనులు, క్వారీలు అధికమే. తాడిపత్రిలో లభించే నాపరాతి బండలు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతున్నాయి. రాయదుర్గం, పామిడి ప్రాంతాల నుంచి జీన్స్, వస్త్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర పట్టణాలకు రవాణా జరుగుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే ఆయా వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ఇదే సమయంలో ఇంధన ధరల ప్రభావం ఎగుమతులపై పడుతోంది. గతంతో పోలిస్తే రవాణాకు 10 శాతం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని వ్యాపారులు, రైతులు వాపోతున్నారు.
సామాన్యులపై పిడుగు
పెట్రో, డీజిల్ ధరల ప్రభావం సామాన్యులపైనా చూపుతోంది. సరకులు, కూరగాయలు రవాణా చేసే వాహనాల బాడుగలు పెంచారు. దీంతో ఆయా సరకుల ధరలు కొండెక్కుతున్నాయి. నిత్యావసరాలు, కూరగాయలు, భవన నిర్మాణ సామగ్రి తదితరాల ధరలూ పెరుగుతూ వస్తున్నాయి. ఆటోలు, కార్లు నడిపి జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారింది. వచ్చే సంపాదన డీజిల్, పెట్రోల్ ఖర్చులకే సరిపోతోందని చోదకులు చెబుతున్నారు. వాహనాల కంతులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం ప్రజారవాణా స్తంభించడంతో దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సొంత వాహనాలపై వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి.
పరిస్థితి దయనీయం