ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీరు కావాలంటే.. అందులోకి దిగాల్సిందే..! - People struggling for water at Uravakonda

తాగునీరు కావాలంటే ఆ కాలనీ వాసులు మురికి కాలువలోకి దిగాల్సిందే. నిత్యం తాగునీరు అందించే ప్రధాన పైప్​లైన్ పగిలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలం కావడంతో సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

People struggling for water
నీటి కోసం ప్రజల ఇక్కట్లు

By

Published : Aug 10, 2021, 10:06 AM IST

నీటి కోసం ప్రజల ఇక్కట్లు... మురుగు కాలవలోకి దిగి మంచినీరు పట్టుకుంటున్న స్థానికులు

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణం శివరామరెడ్డి కాలనీలో తాగునీటి ప్రధాన పైపులైను పగిలిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలవలో దిగి నీటిని పట్టుకుంటున్నారు. చాలా కాలంగా ఇక్కడ ఇదే సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో మురికి కాలువలోకి దిగి తాగునీరు పట్టుకుంటున్నామని, దీని వల్ల విష జ్వరాల బారిన పడుతున్నామని వాపోయారు.

ప్రధాన పైపులైన్ పగిలిపోవడం వల్ల ఇంటి వద్ద ఉన్న కుళాయిలకు నీరు అందడం లేదని స్థానికులు వాపోయారు. పదిహేను రోజులకు ఒకసారి వచ్చే నీరు కూడా అరకొరగా వస్తున్నాయని..ఆ కాస్త నీరు పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వాపోయారు. రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి వస్తారే తప్ప.. తాము సమస్యలు ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాగు నీరు డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:భూ వివాదం.. కలెక్టరేట్ ఎదుట కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details