అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆధార్లో మార్పులు చేర్పులకు జనం పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకానికి ఆధార్ అనుసంధానం చేయడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఆధార్ తప్పనిసరి అయింది. ఏ చిన్న తప్పు దొర్లిన పథకం అందని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా.. చాలామంది తమ వివరాల సవరణల కోసం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
కళ్యాణదుర్గం పట్టణంలో గతంలో ఆంధ్ర బ్యాంక్, తపాలా కార్యాలయంలో ఆధార్ కేంద్రాలు ఉండగా వాటిని పలు కారణాలతో నిలిపివేశారు. అనంతపురం రోడ్ లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న మీసేవ ఆధార్ కేంద్రం ఒకటే పని చేస్తోంది. నిత్యం వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆధార్ కేంద్రానికి చేరుకుని నానా తంటాలు పడుతున్నారు. ఆధార్లో మార్పులు చేర్పుల కోసం కేవలం దరఖాస్తులు పొందేందుకు వారంతా బారులుతీరారు.
తల్లిదండ్రులు వరుసలో నిలుచుంటే పిల్లలు రోడ్డు పక్కన డివైడర్ లపై బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ప్రత్యేక వాహనాల్లో కేంద్రానికి వస్తే దరఖాస్తులు దొరకడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కేంద్రం ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. దరఖాస్తులు పోవడంలో విఫలమై సుమారు 400 మంది వరకు నిరాశతో వెనుదిరిగారు.