Water problems: అనంతపురం జిల్లాలోని 38 గ్రామాల్లో మార్చి నెల ప్రారంభం నుంచే తాగునీటి సమస్య మొదలైంది. సత్యసాయి, శ్రీరాంరెడ్డి తాగునీటి పథకాల ద్వారా జిల్లావ్యాప్తంగా 1,260 గ్రామాలకు తాగునీరు అందుతోంది. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద వివిధ గ్రామాల్లో 6వేల 450 బోర్లు ఉన్నాయి. వీటిలో 2వేల 262 బోర్లకు మరమ్మతులు చేయించాల్సి ఉంది. మూడేళ్లుగా ఆర్డబ్ల్యూఎస్ పథకం నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో మరమ్మతులు నిలిచిపోయాయి. ఆర్డబ్ల్యూఎస్ పథకం నిర్వహణకు పంచాయతీ ఖాతాలోని ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ నిధులను కూడా ప్రభుత్వం లాగేసుకోవటంతో తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది.
Water problems: గతంలో తాగునీటి సమస్య తలెత్తిన గ్రామాల్లో ... ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటి సరఫరా చేసేవారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక ట్యాంకర్ల యజమానులకు డబ్బులు చెల్లించేవారు. మూడేళ్లుగా నిధులు విడుదల కాకపోవటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం లేదు. నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని..ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా..సమస్య తీరటం లేదని ప్రజలు వాపోతున్నారు.
" మాకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. 10-15 రోజులైనా నీళ్లు రావడంలేదు. అధికారులు పట్టించుకోవడంలేదు. కుళాయిలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. నీటి ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేయడంలేదు. నీటి సమస్య తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం."- మహిళలు