ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Water Problem In Marutla: దాహం..దాహం..తారస్థాయికి చేరిన తాగనీటి ఇక్కట్లు - ఏపీ ముఖ్యవార్తలు

Water Problem In Marutla: అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా తయారైంది అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని మరుట్ల గ్రామస్థుల పరిస్థితి. ఓ వైపు జలాశయం.. మరోవైపు గ్రామంలో తాగునీటి పైపులైను ఉన్నా తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఎన్నికల ముందు హామీలిచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చాక కనీసం తాగునీరు అదించలేకపోతున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాహార్తి తీర్చాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు.

Water Problem In Marutla
మరుట్లలో నీటి సమస్య

By

Published : May 18, 2023, 2:19 PM IST

దాహం..దాహం..తారస్థాయికి చేరిన తాగనీటి ఇక్కట్లు

Water Problem In Marutla : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం మరుట్ల-3 గ్రామంలో 400 కుటుంబాలు ఉన్నాయి. 1500 మంది వరకు జనాభా ఉంది. ఈ గ్రామంలో అందరూ వ్యవసాయం చేసుకుని జీవించే వారే. దాదాపుగా ఏడాది కాలంగా తాగునీటి సమస్య ఉంది. అది రెండు నెలలుగా మరింత అధికం అయ్యింది. గ్రామ పంచాయతీ బోర్ల ద్వారా తరుచూ నీటి సరఫరా స్తంభించడం వల్ల సమస్య మరింత కఠినంగా మారింది.

రోజురోజుకు అధికమవుతున్న నీటి సమస్య :దీంతో గ్రామస్థులు వ్యవసాయ పొలాలు, దగ్గరలోని ఎంపీఆర్ జలాశయం నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో నీటిని తెచ్చుకుని కాలం గడుపుతున్నారు. ఇది అన్ని కుటుంబాలకు సాధ్యం కాక పోవడంతో అక్కడి పేదలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి లభ్యత సరిగా లేని కారణంగా కొందరు రోజుల తరబడి స్నానం కూడా చేయలేని దుస్థితి. ఈ నీటి సమస్య రోజుకు రోజుకు అధికం అవుతోందని వారు వాపోతున్నారు. తమ దాహార్తి తీర్చాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు.
నీటి సమస్యను పరిష్కరించని అధికారులు : మరుట్ల-3 గ్రామానికి గత ప్రభుత్వ హయాంలో ఆర్​డబ్ల్యూఎస్ కూడేరు తాగునీటి పథకం కింద పైపులైన్ నిర్మించారు. దాని ద్వారా ఏడాది క్రితం వరకు తాగునీరు సరఫరా అయ్యాయి. గ్రామస్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సదుపాయాన్ని పొందారు. అయితే పది నెలల క్రితం ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న ఉదిరిపికొండ తండా వద్ద మరుట్ల-3కి నీరు రాకుండ పైపులైనులో నీటి సరఫరా గ్రామానికి రాకుండా కొందరు వ్యక్తులు ఆపి వేశారు. దీనిపై గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఆర్​డబ్ల్యూఎస్ ఎస్​ఈ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తాము క్షేత్ర స్థాయికి వచ్చి పరిశీలించి, నీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు... ఏడాది కావస్తున్నా ఆ అధికారులు అటువైపు రాలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
నీటి సమస్యలపై ప్రశ్నించిన వారి కేసులు :ఇందులో రాజకీయ కోణం కారణంతోను నీటి సరఫరా రాకుండా చేసారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆ గ్రామానికి నీటి సరఫరా విషయంలో అడ్డగింపులను సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లే నీటిని అడ్డగించడం వెనుక ఉన్న కారణం అదేనని గ్రామంలోనూ అందరూ చర్చించుకుంటున్నారు. ఆ పైపులైనులో నీటి సరఫరా ఆపేసిన సమయంలో గ్రామస్థులు నిలదీశారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు ఒకరిద్దరిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది.
అధికారులను వేడుకుంటున్న గ్రామస్థులు : రాజకీయ కారణాలతో నీటి సరఫరాను ఆపేయటం ఎంత వరకు న్యాయమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని తమ సమస్యను గుర్తించి నీటి సరఫరాను పురుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

"నాలుగు నెలల నుంచి నీళ్లు లేవు. తాండాలోకి వెళ్లి తెచ్చుకుంటున్నాము. వారు 10 బిందెలు పట్టుకున్న వెంటనే మోటర్ ఆపేస్తారు. నీళ్ల కోసం తెల్లవారు జామున 3 గంటలకు లేస్తున్నాము. ఈ నీటి సమస్య కారణంగా నిద్ర కూడా లేదు. ఏ అధికారికి చెప్పిన వినడం లేదు. ఇంకా మేము ఎవ్వరికి చెప్పుకోవాలి."- గ్రామస్థులు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details