అన్ని మతాలను గౌరవించడం మన దేశ సంస్కృతి. మతంతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోవడం భారతీయులమైన మన డీఎన్ఏలోనే ఉంది. ఇందుకు ఉదాహరణ కర్నూల్, అనంతపురంలో జరిగిన ఈ వేడుక.
పీర్ల పండుగ సందర్భంగా కర్నూల్ జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి పెద్ద పీర్లు వచ్చాయి. పూజారి వాటికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఊరేగింపు నిర్వహించి పీర్లను నిమజ్జనం చేశారు.
ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి హిందువుల దేవుడు. ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే ఇదే సమయంలో ముస్లింల పెద్ద పీర్ల పండుగ సందర్భంగా పీర్లను కొలువు తీర్చారు. చివరి రోజు కావడంతో నిమజ్జనం చేయడం సంప్రదాయం. ఈ సందర్భంగా పీర్లను ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. పూజారి హారతి ఇచ్చారు.
చాలా ఏళ్లుగా ఇలా చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పీర్లను నిమజ్జనం చేశారు.