అనంతపురం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల అధికారుల నిర్లక్ష్యం.. కరోనా బాధితులకు శాపంగా మారుతోంది. కొవిడ్ రోగుల చికిత్సకు సంజీవినిలా భావించే విలువైన వెంటిలేటర్లను.. వినియోగించకుండా పక్కన పడేశారు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 70 వెంటిలేటర్లు ఉండగా.. ఒక్కటి మాత్రమే వాడుతున్నారు. మిగిలిన 69 వెంటిలేటర్లు సీల్డ్ బాక్సుల నుంచి బయటికి కూడా తీయలేదు. కదిరి ఆస్పత్రిలో వంద పడకలుంటే.. అక్కడ ఒక్క వెంటిలేటర్ కూడా లేదు. దీనివల్ల పరిస్థితి తీవ్రంగా ఉన్న కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 87 వెంటిలేటర్లు ఉండగా.. కేవలం మూడు మాత్రమే వాడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నాలుగు వెంటిలేటర్లు ఆసుపత్రికి విరాళం ఇవ్వగా.. వాటిని పెట్టెల్లో నుంచి కూడా తీయలేదు. రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నామని.. అవసరం మేరకే వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఎంతో విలువైన వెంటిలేటర్లను వాడకంలోకి తెచ్చి.. కరోనా రోగుల ప్రాణాలను కాపాడాలని బాధిత బంధువులు కోరుతున్నారు.