ఇన్ఫెక్షన్లకు నిలయంగా అనంతపురం సర్వజనాసుపత్రి.. కంటిచూపు కోల్పోయిన రోగి Patient Lost Sight after Surgery: అనంతపురం సర్వజనాసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయలేం అంటూ పలు విభాగాల వైద్య నిపుణులు ఉన్నతాధికారులకు తేల్చిచెబుతున్నారు. గతంలో డాక్టర్ సుధాకర్ మాస్కులు, గ్లౌజులు లేవని చెప్పినందుకు ప్రభుత్వం వేధించిన తీరుపై నోరు మెదపకుండా భయంతో ఉన్న వైద్యులు.. ప్రస్తుతం కంటి ఇన్ఫెక్షన్ల కారణంగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆస్పత్రిలో గత నెల 26న రామస్వామి, మహాలక్ష్మి, అనుసూయమ్మ, బాలమ్మలకు కంటి శుక్లం శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం మూడో రోజు సాధారణ పరీక్షలకు వచ్చిన రోగుల కళ్లు ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు గుర్తించిన వైద్యులు వెంటనే వారిని కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలకు పంపించారు. అప్పటికే కంటి లోపలి వరకు ఇన్ఫెక్షన్ తీవ్రత వ్యాప్తి చెందటంతో రామస్వామికి కనుగుడ్డు తొలగించటంతో ఓ కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది.
మోటర్ రీ వైండింగ్ దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తున్న రామస్వామి కుటుంబం ఈ పరిణామంతో తీవ్రంగా కుమిలిపోతోంది. నలుగురు రోగులకు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స గదిని మూసివేశారు. వాస్తవానికి ఓటీలో ప్రతిరోజు ఉదయాన్నే కార్పోలిక్ యాసిడ్, ఫార్మొలిన్ తదితర రసాయనాలతో బ్యాక్టీరియా రహితంగా చేయాల్సి ఉంది. రెండు రకాల రసాయనాలు మాత్రం సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి కొంతమేర ఇస్తుండగా, మిగిలిన రసాయనాలు బహిరంగ మార్కెట్లో లోకల్ పర్చేజ్ ప్రాతిపదికన రోజూ కొనుగోలు చేయాల్సి ఉంది.
గత ప్రభుత్వాలు ఆస్పత్రిలో అత్యవసరంగా కొనుగోలు చేయాల్సిన మందులు, ఇతర వస్తువుల కోసం ప్రతినెల కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు నిధులిచ్చేవి. నాలుగేళ్లుగా లోకల్ పర్చేజ్ నిధుల కొరత కారణంగా అన్ని రకాల రసాయనాలను ఓటీలో వినియోగించటం లేదు. రోగులకు ఇన్ఫెక్షన్లు సోకినట్లు గుర్తించిన వెంటనే వారికిచ్చిన కంటి చుక్కలమందు, ఇతర పరికరాలన్నీ బ్యాక్టీరియా పరీక్షలకు పంపినట్లు కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు.
సర్వజన ఆస్పత్రిలో ఐదు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కంటి శస్త్రచికిత్సకు, ఆర్థో గైనిక్ విభాగాలకు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉండగా, జనరల్ సర్జరీ విభాగానికి ప్రత్యేకంగా ఓటీ కాంప్లెక్స్ ఉంది. కంటి శస్త్రచికిత్సలు నిర్వహించే గది కింద ఏఎంసీ, పక్కనే క్యాంటీన్ ఉన్నాయి. థియేటర్ పరిసరాల్లో ఇలాంటివి ఉండటంవల్ల ఆపరేషన్ చేసుకున్న రోగులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందని మత్తుమందు నిపుణులతోపాటు, శస్త్రచికిత్సల వైద్యులు చెబుతున్నారు. శస్త్రచికిత్సలు చేయలేమని చెబితే ప్రభుత్వంతో ఇబ్బంది, చేస్తే ఇన్ఫెక్షన్లు సోకి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆస్పత్రిలోని ఓ విభాగం అధికారి తెలిపారు.
శస్త్రచికిత్సలు నిర్వహించటంపై తమ పరిస్థితి ముందు గొయ్యి, వెనుక నుయ్యి చందంగా మారిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను గుర్తించేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఆపరేషన్ థియేటర్‌లో ఇన్ఫెక్షన్లు సోకి రోగులు కంటిచూపును కోల్పోయారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
"హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్లాము. వాళ్లు పరిశీలించి.. ఆపరేషన్ ఫెయిల్ అయింది అని చెప్పారు. కన్ను ఇన్ఫెక్షన్ అయింది.. దానిని తీసేయాలి అని అన్నారు. కన్ను ఉంటే తరువాత చాలా సమస్య అవుతుంది అని అన్నారు". -రాఘవేంద్ర, బాధితుడి బంధువు