పరిటాల రవి చనిపోయి 15 ఏళ్లు గడిచినా ఇంకా ఆయన అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లాలోని రవి స్వగ్రామం వెంకటాపురంలో వేలాది మంది అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. పరిటాల సునీతతో పాటు, తనయుడు శ్రీరాం ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద పూజలు చేసి నివాళులు అర్పించారు. అభిమానులు, కార్యకర్తల కోసం అన్నదానం చేపట్టారు. రవి చనిపోయిన నాటి నుంచి ఆయన ఆశయ సాధన కోసమే పని చేస్తున్నామని పరిటాల సునీత తెలిపారు. రానున్న రోజుల్లో రాప్తాడు, ధర్మవరంతోపాటు అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
కళ్యాణదుర్గం తెదేపా కార్యాలయంలో పరిటాల రవి 15వ వర్ధంతిని నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జీ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సీనియర్ తెదేపా నాయకుడు మారేపల్లి మల్లికార్జున పరిటాల రవి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. పరిటాల రవి అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.