అనంతపురం జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
- మడకశిర నియోజకవర్గంలో 68 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో వివిధ పార్టీలకు చెందిన 223 ఎంపీటీసీ అభ్యర్థులు,26 జడ్పీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు నియోజకవర్గవ్యాప్తంగా 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మందకొడిగా సాగుతోంది. మడకశిర మండలం గంగులవాయిపాలెం గ్రామంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఆయన సతీమణితో కలిసి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులతో మాట్లాడుతూ గెలుపోటములను సమానంగా తీసుకొని పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని అభ్యర్థులకు సూచించారు.
- ఉరవకొండ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలకుగాను 183మంది, ఐదు జడ్పీటీసీ స్థానాలకు 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,17,812 మంది ఓటర్లు ఉన్నారు.
- హిందూపురంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం గ్రామీణ మండలంలోని 43 ఎంపీటీసీ స్థానాలకు, రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. చిలమత్తూరు జెడ్పీటీసీ అభ్యర్థిని మరణించటంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
- అనంతపురం రూరల్ రుద్రంపేట, కుక్కలపల్లి పంచాయతీ, జాకీర్ కొట్టాల పరిసర ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.
- కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు సెగ్మెంట్లలో ఓటర్లు బారులు తీరారు. కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి, గోళ్లు, నారాయణపురం గ్రామాలతో పాటు బ్రహ్మసముద్రం, కుందుర్పి, సెట్టూరు, కంబదూరు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో కూడా ఓటర్లు 8 గంటల నుంచి బారులుతీరారు.
- గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, గుంతకల్లు, పామిడి మండల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం నియోజకవర్గంలో 32 ఎంపీటీసీ, 3 జడ్పిటిసి స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారుతొండపాడు ,కొత్తపేట, బసినేపల్లి గ్రామాల్లో పొలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటల నుండి ఓటర్లు బారులు తీరారు.
- శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం అయింది. కక్కలపల్లి పంచాయతీ పరిధిలో ఓటర్ల పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనంతపురం రూరల్ పరిధి ప్రాంతాల్లో వృద్ధులు కూడా కుటుంబ సభ్యుల సహాయంతో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.