Pamidi Garment Industry : చిన్నారులు, మహిళల వస్త్ర వ్యాపారంలో పామిడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తూకాల్లో వస్త్రాల అమ్మకానికి ఇక్కడ పెట్టింది పేరు. ఇప్పటికే కరోనా రాకతో వస్త్ర పరిశ్రమ అతలాకుతలమవ్వగా... కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వ్యాపారులకు గుదిబండలా మారింది. గార్మెంట్ పరిశ్రమపై విధించిన 5 శాతం జీఎస్టీ 12 శాతానికి పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పత్తి ధర సైతం రెట్టింపు కావడంతో గుజరాత్, అహ్మదాబాద్ వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలు క్లాత్‌పై ధరలు అమాంతం పెంచాయి. ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టడంతో వస్త్ర దుకాణాలు మూసివేసే పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు.
" నైటీకి 20-30 రూపాయలు ఇప్పటికి పెరిగింది. పదివేల రూపాయల డ్రస్సు తయారు చేస్తే ఇంకెంత పెరుగుతాయి. నైటీల వ్యాపారం ఇప్పటికే కుదేలైంది. ఇంకా పెరుగుతుందంటున్నారు. వ్యాపారాలు చేయలేక దుకాణాలు మూతబడుతున్నాయి."- రామాంజనేయులు, దుస్తుల తయారీదారు
" ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న పామిడి మార్కెట్ విలవిలలాడటానికి కారణం జీఎస్టీ. జీఎస్టీ ఐదు శాతం అన్నప్పుడే ఈ వ్యాపారం కుదేలైంది. ఇప్పుడు 12శాతం పెట్టడం వలన వ్యాపారస్తులు దుకాణాలన్నింటిని మూతవేసి కూలీలుగా మారాల్సిన రోజులు వస్తాయి. జీఎస్టీ పెంపుతో ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ఈ గార్మెంట్ వ్యవస్థను సర్వనాశనం చేయవద్దని కోరుతున్నాం. " - హాజీ రుక్మాన్, గార్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఇదీ చదవండి : Review On Corona Cases : బెంభేలెత్తిస్తోన్న కరోనా పాజిటివిటీ రేటు..పడకలను పెంచుతోన్న ఆసుపత్రులు