ఇన్నాళ్లూ వేచిచూసిన తరుణం రానే వచ్చింది. పుట్టపర్తి కేంద్రంగా నూతన జిల్లా అవతరించబోతోంది. సోమవారం ఉదయం 9.05 - 9.45 గంటల మధ్య సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో పుట్టపర్తి పట్టణంలోని సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి కార్యాలయాలను ఎంపిక చేశారు. ఎస్పీ, జేసీలు, డీఆర్వో, ఆర్డీ్వోల పేర్లు ఖరారు చేశారు. మిగతాశాఖల ఉద్యోగుల బదిలీలపై ఇంకా స్పష్టత రాలేదు. శ్రీసత్యసాయి జిల్లా మొదటి ఎస్పీగా రాహుల్ దేవ్‌సింగ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం జిల్లా మొదటి కలెక్టర్‌గా బసంత్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరుక్షణం నుంచి కొత్త జిల్లా నుంచి అధికారికంగా పాలన మొదలవుతుంది.
కుగ్రామం నుంచి జిల్లాకేంద్రంగా: వందేళ్ల కిందట చిన్న కుగ్రామంగా ఉన్న పుట్టపర్తి నేడు జిల్లా కేంద్రం స్థాయికి చేరుకుంది. 1926లో సత్యసాయి బాబా జన్మించినప్పుడు గ్రామంలో 250 కుటుంబాలు ఉండేవి. 1986లో కమ్మవారిపల్లి, కర్ణాటకనాగేపల్లి, రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి అనే నాలుగు గ్రామాలతో కలిసి పుట్టపర్తి కేంద్రంగా పంచాయతీ ఏర్పాటైంది. 1990 వరకు పుట్టపర్తి పట్టణ విస్తరణ అంతంత మాత్రమేనని చెప్పాలి. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, విమానాశ్రయం, తాగునీరు అందుబాటులోకి వచ్చాక పట్టణ విస్తరణ శరవేగంగా సాగింది. తర్వాత మరో 4 గ్రామాలు కలుపుకొని 2006లో మేజర్ పంచాయతీగా రూపాంతరం చెందింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గోరంట్ల నుంచి విడిపోయి ఆరు మండలాలతో కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2011లో నగర పంచాయతీగా ఉన్నతీకరించారు.
రెవెన్యూ డివిజన్‌గా: పుట్టపర్తి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కదిరి రెవెన్యూ డివిజన్‌లో పుట్టపర్తి 6 మండలాలు ఉండేవి. ప్రస్తుతం అమడగూరు మాత్రమే కదిరిలో కొనసాగుతోంది. పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లోని గోరంట్లను పుట్టపర్తిలో కలిపేసి 6 మండలాలతో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. రాప్తాడులోని మూడు మండలాలు శ్రీసత్యసాయి జిల్లాకు, మిగిలిన మూడు అనంతపురం జిల్లాకు కేటాయించారు.
శ్రీసత్యసాయి జిల్లాలో నియోజకవర్గాలు : పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, మడకశిర, (రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలు).
రెవెన్యూ డివిజన్లు : పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ.
పుట్టపర్తి డివిజన్ : పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడీసీ, గోరంట్ల.
కదిరి డివిజన్ : కదిరి, తలుపుల, తనకల్లు, గాండ్లపెంట, నంబూలపూలకుంట, నల్లచెరువు, అమడగూరు.