వైకాపా నాయకుల ఒత్తిడితో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు, పోలీసులకు సాయమందించేందుకు ముందుకొస్తున్నవారిని నోటీసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. అనంతపురం జిల్లా కదిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్... కరోనా కట్టడి విధుల్లో పాల్గొంటున్న వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ అధికారుల కోసం రూ.12లక్షల విలువైన పీపీఈ యూనిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందించారు.
'వైకాపా నేతల ఒత్తిడితో అధికారుల అత్యుత్సాహం' - అనంత రాజకీయాలు తాజా వార్తలు
అనంతపురం జిల్లాలో స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్నవారిని వైకాపా నేతలు అధికార బలంతో అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే వాటి పంపిణీ పేరుతో బెంగళూరుకు వెళ్తున్నారంటూ వెంకటప్రసాద్‌ను అడ్డుకుని క్వారంటైన్‌కు తరలించాలంటూ వైకాపా నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని తెదేపా నేతలు చెబుతున్నారు. వైకాపా ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు తెదేపా నేత కందికుంటకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతితోనే తాను బెంగళూరు, హైదరాబాద్ వెళ్లి వాటిని తీసుకొచ్చినట్లు కందికుంట వెంకటప్రసాద్ చెప్పారు. సామాజిక స్పృహ కలిగిన నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అడ్డుకునేలా వైకాపా నాయకులు కుట్రలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.