దేశవ్యాప్తంగా ఉల్లి ధరల పెరుగుదలతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం రాయితీతో ఉల్లి పంపిణీ చేస్తున్నా...తమకు అందటం లేదని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం రైతు బజార్లో పది రోజులుగా ఉల్లి పంపిణీ జరగుతుండగా...అర్ధరాత్రి నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి వేలం ద్వారా కొనుగోలు చేసి కిలో రూ.25 చొప్పున, ప్రతి కుటుంబానికి రెండు కిలోలు పంపిణీ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో ఉల్లి ధర అధికంగా ఉండటంతో రెండు కిలోల ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూలైన్లో నిరీక్షించటానికి కూడా వెనుకాడటంలేదు ప్రజలు.
తీవ్ర వర్షాలతో పంట నష్టం...
దేశవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బతింది. విదేశాలకు పెద్దఎత్తున ఉల్లిని ఎగుమతి చేసే మహారాష్ట్రలో కూడా... ప్రస్తుతం ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. గత ఏడాది ధరలు లేక గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన ఉల్లిని, మహారాష్ట్ర వ్యాపారులు నెమ్మదిగా మార్కెట్లో విడుదల చేస్తూ, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధరలు అదుపు చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను సైతం వ్యాపారులు విఫలం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.