Diesel Supply from Karnataka: ఓ ప్రభుత్వ ఉద్యోగి తన పని తాను సక్రమంగా చేస్తుంటే.. ఓ కాంట్రాక్టర్ రెచ్చిపోయారు. నోటికి వచ్చినట్టు మాట్లాడారు. తప్పేమీ లేదని వాదించారు. అయినా సరే ఆ ప్రభుత్వ ఉద్యోగి.. కాంట్రాక్టర్ బెదిరింపులకు తలొగ్గలేదు. నాలుగు గంటల పాటు సాగిన రచ్చ తర్వాత.. ట్యాంకర్ని సీజ్ చేశారు. ఏం జరిగిందంటే...
అనంతపురం జిల్లాలోని ఆర్టీసీ డిపోలకు కర్ణాటక నుంచి డీజిల్ సరఫరా చేస్తూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. గుంతకల్లు ఆర్టీసీ డిపోలో ఓ ట్యాంకర్‌ను.. రెవెన్యూ అధికారులు నాటకీయ పరిణామాల మధ్య సీజ్ చేశారు. 12వేల లీటర్లతో గుంతకల్లు డిపోకు డీజిల్ ట్యాంకర్ రాగా.. రెవెన్యూ అధికారులు వే బిల్లులు పరిశీలించారు. గుంతకల్లు ఆర్టీసీ డిపోకు.. 130 కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నెలోని ఫిల్లింగ్ స్టేషన్ నుంచి.. డీజిల్ సరఫరా చేయాలని కాంట్రాక్టు ఇచ్చారు. కానీ గుత్తేదారు 450 కిలోమీటర్ల దూరంలోని మడకశిర నుంచి డీజిల్ ట్యాంకర్ తెప్పించారు.