రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలతో.. పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది.. కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తున్నారు. ఆంక్షలు అమల్లో ఉన్న వేళ జనం తమకు సహకరించాలని కోరారు. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో అమలవుతున్న కర్ఫ్యూను పరిశీలించారు.
అనంతపురం జిల్లాలో..
కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని అనంతపురం రేంజి డీఐజీ కాంతిరాణాటాటా, జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సూచించారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో కరోనా మూడో వేవ్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకు దుకాణాలు మూసి వేయాలని, సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు చేరుకోవాలని చెప్పారు. ఆంక్షలు ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో..
కరోనా కేసులు తగ్గినా... ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. నగరంలోని రాజ్ విహర్ కుడలిలో ఆకస్మిక తనిఖీ చేశారు. సాయంత్రం 5 గంటలకు దుకాణాలు మూసివేసి... ఆరు గంటల లోపు అందరూ ఇంటికి వెళ్లాలని ఎస్పీ స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
ఉండ్రాజవరం, తణుకు మండలాల్లో పాజిటివ్ కేసుల రేటు అధికంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉండ్రాజవరంలో రెండు నెలలుగా అమలవుతున్న ఆదివారం పూర్తి కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన రోజుల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచి వ్యాపార లావాదేవీలు కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. తణుకు మండలంలోని అన్ని గ్రామాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి:
పొలం వివాదంలో ఘర్షణ... దంపతులకు గాయాలు