CANCELLATION OF PENSIONS : ఉమ్మడి అనంతపురం జిల్లాలో సామాజిక పింఛన్ల తొలగింపు నోటీసులు అందుకున్న వారంతా కన్నీరు మున్నీరవుతున్నరు. పింఛన్ తొలగించి కడుపుమీద కొడతున్నారంటూ నిరుపేద లబ్ధిదారులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పెనుకొండ మండలం ఇస్లాపురంలో రజకవృత్తి చేస్తున్న నిరుపేద రామక్కకు భర్త చనిపోవటంతో 13 ఏళ్లుగా వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఈమెకు లక్ష 31 చదరపు అడుగుల్లో ఇల్లు ఉందని.. పింఛన్ తొలగిస్తామని నోటీసు ఇచ్చారు. ఇస్లాపురం గ్రామంలోని 158 ఇళ్లన్నీ రామక్క ఆధార్ నెంబర్‌కు అనుసంధానం చేసిన అధికారులు పింఛన్‌కు అనర్హురాలిగా నోటీసు ఇచ్చారు. అలాగే వృద్ధుడు నారాయణప్పకి వెయ్యి అడుగుల ఇల్లు ఉందని నోటీసు ఇచ్చారు.
"మాకు పింఛన్లు లేకుండా చేశారు. 158 ఇళ్లు ఉన్నాయని నోటీసులు ఇచ్చారు. కేవలం ఇందిరమ్మ ఇళ్ల కింద ఇచ్చిన ఒకటిన్నర సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టకున్నాం. దయచేసి నాకు పింఛన్ ఇప్పించండి"-రామక్క, బాధితురాలు
హిందూపురంలో దివ్యాంగురాలైన విద్యార్థి స్పందనది అత్యంత దయనీయ పరిస్థితి. పుట్టుకతో దివ్యాంగురాలు కావటంతో సామాజిక పింఛన్ తీసుకుంటోంది. అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిగా ఉన్న 1100 చదరపు అడుగుల ఇంటిలో స్పందన తండ్రిది కేవలం 310 గజాలు మాత్రమే. కాని అధికారులు మాత్రం వెయ్యి చదరపు ఇల్లు ఉందని పింఛన్ తొలగిస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. ఈ తండ్రీ, కుమార్తె ఆవేదన ఎంత చెప్పినా తక్కువే.
"నాకు పుట్టిన అప్పటి నుంచి వికలాంగులు పింఛన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇదీ కూడా తీసేశారు. అమ్మఒడి కూడా రావట్లేదు. మాకు చిన్న ఇళ్లు మాత్రమే ఉంది. దయచేసి నాకు పింఛన్ ఇప్పించండి"-స్పందన, దివ్యాంగురాలు