Officials about Irrigation Water to HLC: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికి గ్రామ పరిసరాల్లో 4వేల ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట వృద్ధి దశలో ఉంది. పూర్తి స్థాయిలో పంట చేతికి రావాలంటే జనవరి వరకు సాగు నీరు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో నవంబరు 10 నుంచి హెచ్ఎల్సీకి (High Level Canal) నీటిని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కో ఎకరాకు ఇప్పటికే లక్ష వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పంట సాగు చేసిన వారిలో అత్యధికంగా కౌలు రైతులే కావడంతో.. నీరు రాకపోతే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
అధికారులు ప్రకటించిన సమయానికి నీరు నిలిపివేస్తే.. రైతులు పడిన శ్రమ, పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కళ్లెదుటే ఆశాజనకంగా పెరుగుతున్న పంటను వదిలేయలేక.. దానిని కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. పొలాల్లోనే నీరు నిల్వ ఉండే విధంగా కుంటలు తవ్వి.. మోటర్ల సాయంతో నీటిని నింపుతున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో లక్ష రూపాయిల ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
మరికొందరు రైతులు బోర్లను తవ్వించుకుంటున్నారు. విద్యుత్ మోటర్లు, ఇంజన్లు, ఇలా ఒక బోరు నుంచి నీరు బయటకు రావాలంటే సుమారు లక్షా యాభై వేల వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సివస్తోందని రైతులు చెబుతున్నారు. నవంబర్ 10 నుంచి నీటిని నిలిపివేస్తామన్న నిర్ణయాన్ని నీటి పారుదలశాఖ అధికారులు ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు. తక్షణమే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి నీటి విడుదలను కొనసాగించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.