అనంతపురం సర్వజన వైద్యశాలలో పడకల కొరతతో కరోనా రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాధితులు నేలపైనే నిరీక్షిస్తుండగా కొన ఊపిరితో ఉన్న రోగులకూ నేలపైనే చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు వస్తున్న గ్రామీణ ప్రాంతాల్ని గుర్తించి మైక్రో కంటైన్మెంట్ జోన్లగా ప్రకటించి నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కరోనా కట్టడికి సర్పంచ్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని కొవిడ్ లక్షణాలు ఉన్న వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆ కమిటీ చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు.
కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం మీట్య తండాలో అనారోగ్యంతో ఓ వృద్ధుడు మరణించగా అంత్యక్రియలకు ఎవరూ ముందుకురాకపోవడంతో పోలీసులే దహన సంస్కారాలు చేశారు. కృష్ణా జిల్లాలో కరోనా బాధితులకు ఆర్ఎంపీలు వైద్యం చేస్తూ స్టెరాయిడ్స్ ఇస్తున్నారని అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. విశాఖ సెంట్రల్ జైలులో 127 మంది ఖైదీలకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా 50 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వారందరికీ అక్కడే చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కురుకూతిలో బ్యాంక్ మిత్రగా పనిచేస్తున్న మనోహర్‌కి ఈనెల 23న వివాహం జరనుండగా కరోనాతో గురువారం మృతిచెందాడు.