NTR Shopping Complex: అనంతపురం సాయినగర్ ప్రధాన రహదారి ప్రాంతం ఇది. నిత్యం కిక్కిరిసిన ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. ఈ రహదారిని ఆనుకొని జిల్లా ప్రజాపరిషత్ ప్రహరీ ఉంది. దీన్ని తొలగించి దుకాణ సముదాయం నిర్మిస్తే.. జిల్లా పరిషత్ అవసరాలకు ప్రతినెలా అద్దె వస్తుందని గత ప్రభుత్వంలో జడ్పీ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. ఆ దుకాణాలను పేద యువతతో పాటు, దివ్యాంగులైన వారికి కేటాయిస్తే ఉపాధి కల్పించినట్లు అవుతుందని భావించింది. ఆ మేరకు 2019లో 40 లక్షల రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు.
అందులో 12 షాపులు కట్టారు. దానికి, ఎన్టీఆర్ పేరుపెట్టారు. అప్పట్లో మంత్రుల హోదాలో కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ప్రారంభించారు. వీటిని..అద్దె ప్రాతిపదికన కేటాయించే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో.. ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ షాపుల షెట్టర్లు తెరిచిన పాపానపోలేదు.
సాయినగర్‌లో చిన్నపాటి దుకాణం అద్దెకు తీసుకోవాలన్నా కనీసం 7నుంచి 10 వేలు పెట్టాలి. జడ్పీ ప్రాంగణంలో ఉన్న షాపులు 120 నుంచి 180 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ దుకాణాలు.. నిరుపయోగంగా ఉంచడంతో గోడలకు పగుళ్లు వచ్చాయి. వీటిని కేటాయించాలంటూ.. జిల్లా పరిషత్ అధికారులకు అనేక విజ్ఞాపనలూ వెళ్లాయి. కానీ అవన్నీ పాలకపక్షం చెవికెక్కించుకోలేదు. కేవలం ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్లే.. వీటిని అందుబాటులోకి తేవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.