నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులు సాధించడంలో బిందుసేద్య విధానం అత్యంత ప్రధానమైనది. నీటిని ఆదా చేస్తూ, ప్రతి మొక్కకు సమానంగా నీటిని అందించటం వల్ల అనంత ఉద్యాన ఉత్పత్తులకు దేశంలోనే ప్రత్యేక ఆదరణ ఉంది. మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం ఉద్యాన ఉత్పత్తులు నాణ్యతగా ఉంటాయని పేరుంది. బిందు సేద్యం, తుంపర్ల సేద్యం పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తుండగా.. రైతులు కేవలం 10 శాతం సొమ్ము చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఈ పథకం అమలవుతుండటంతో వేల మంది రైతులు ఉద్యాన పంటల సాగుతో పెద్దఎత్తున ప్రయోజనం పొందారు.
రైతులకు అందని పరికరాలు...
రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే బిందు సేద్యం రాయితీ పథకం ఏడాది కాలంగా నిలిచిపోయింది. రెండేళ్లనాటి లక్ష్యాలను పూర్తి చేయటానికి కూడా కంపెనీలు సహకరించట్లేదు. 2019-20 సంవత్సరంలో 29 వేల హెక్టార్లకు బిందు, తుంపర్ల సేద్య పరికరాలు రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. అయితే ఆ ఏడాదికి సంబంధించి పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు ప్రభుత్వం పెద్దఎత్తున బకాయిపడటంతో, ఇంకా 3వేల మంది రైతులకు పరికరాలు అందలేదు. డ్రిప్ పరికరాల కోసం పేరు నమోదు చేసుకున్నా ఇంతవరకు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.