NO RESPONCE IN SPANDANA : ప్రతి సోమవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే స్పందనకు అధికారుల నుంచి స్పందన కరవైంది. జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్‌కు చెబితే సమస్య పరిష్కారం అవుతుందనే గంపెడాశతో వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. స్పందనలో ఫిర్యాదులను పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖాధికారులకు, మండల స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో.. బాధితులు పలు మార్లు స్పందన చుట్టూ తిరగడం తప్పడం లేదు.
ఒకే సమస్యపై ఏళ్ల తరబడి స్పందనలో.. పదుల సార్లు ఫిర్యాదులు చేస్తున్నవారు కొందరైతే, నెలల తరబడి తిరుగుతున్న బాధితులు అనేకమంది ఉన్నారు. స్పందనకు వస్తున్న బాధితులను ఎవరిని కదిలించినా.. తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఫిర్యాదు చేస్తున్న సమస్యలను పరిష్కరించినట్లు అధికారులు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారు. మరోవైపు సగానికి పైగా అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా దాటవేస్తున్నారని.. మరికొంత మంది వాపోతున్నారు. కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులు జారీ చేసే అదేశాలు.. క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.