No Response in Spandana Program : భూ సమస్య, ఇంటి తగాదా, దారి సమస్య, భూ సర్వేలో ఇబ్బందులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో స్పందన మెట్లు ఎక్కుతున్నారు. తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నా.. అడిగి అడిగి గొంతులారిపోతున్నా వారి సమస్య మాత్రం తీరడం లేదు. పదుల సార్లు దరఖాస్తులతో ఫైళ్లు నిండిపోయేలా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్పందనలో సమస్యలు తీరక.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాధితులకు నిరాశే మిగులుతోంది. ప్రభుత్వం గొప్పగా చెప్తున్న సమస్యలు మారటం తీరటం లేదని భాదితులు వాపోతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కలెక్టర్లు నిర్వహిస్తున్న స్పందనకు.. దిగువ స్థాయి అధికారుల నుంచి స్పందన కరవైంది. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు చెబితే సమస్య పరిష్కారం అవుతుందని గంపెడాశతో వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖాధికారులకు, మండల స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో.. బాధితులు పలుమార్లు స్పందన చుట్టూ తిరగక తప్పడం లేదు. ఒకే సమస్యపై ఏళ్ల తరబడి స్పందనలో పదుల సార్లు ఫిర్యాదులు చేస్తున్నవారు కొందరైతే, ఏడాదిన్నర నుంచి తిరుగుతున్న బాధితులు చాలా మంది ఉన్నారు. స్పందనకు వస్తున్న బాధితులను ఎవరిని కదిలించినా.. అధికారులపై గుర్రుమంటున్నారు. జగనన్న భూహక్కు, భూసర్వేతో.. యజమానుల మధ్య గొడవలు తలెత్తినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"సంవత్సరం నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న.. నాకు భూ సమస్య ఉంది. నా సమస్య ఎవరూ పట్టించుకోవటం లేదు. ప్రతిదినం రావటం పోవటం... గట్టిగా అడిగితే తహసీల్దార్ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."-బాధితుడు