సామాన్యుల సమస్యలకు సత్వర సేవలందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు రెవెన్యూ అధికారుల తీరు మాత్రం మారటం లేదు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి స్పందన కార్యక్రమంలో పురోగతిని సమీక్షిస్తున్నా భూవివాదాల పరిష్కారంలో కొందరు తహసీల్దార్ల తీరు మారలేదు. ప్రతినెలా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోందే తప్పా పరిష్కారం చేస్తున్న దాఖలాలు వెదికిచూసినా కనిపించని పరిస్థితి. అనంతపురంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన రైతుల్లో కార్యాలయాల చుట్టూ ఎన్నో ఏళ్ల నుంచి తిరుగుతున్నవారే ఎక్కువమంది కనిపించారు.
ప్రజా ఫిర్యాదులపై "స్పందన" కరవు - SPANDANA
ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం చూపే 'స్పందన' కార్యక్రమానికి అధికారుల నుంచి స్పందనే కరవైంది. రెవెన్యూశాఖ సేవాలోపంపై అందుతున్న ఫిర్యాదులపై ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలనూ కొందరు తహసీల్దార్లు ఖాతరు చేయడం లేదు. భూవివాదాలతో మండల కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు కలెక్టరేట్‌కు వచ్చినా పరిష్కారం కాని పరిస్థితే కనిపిస్తోంది.
స్పందన కార్యక్రమంలో అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేసినా న్యాయం జరిగిన దాఖలాలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. రైతుల ఫిర్యాదులపై కలెక్టర్ సత్యనారాయణ ఆదేశాలనూ కొందరు తహసీల్దారులు లెక్కచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్ సంతకంతో తిరిగి కార్యాలయానికి వస్తే తహసీల్దార్ ఆగ్రహావేశాలకు అంతే ఉండదని రైతులు కంటతడి పెడుతున్నారు.
భూవివాదాల పరిష్కారానికి సమయం పడుతుందని ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి శంకరనారాయణ అన్నారు. అధికారుల అలసత్వం ఉంటే విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో అమాయక రైతుల భూములు ఆక్రమించటం, సరిహద్దులు చెరిపేయటం వంటి దౌర్జన్యాలు పెచ్చుమీరిపోయాయి. భూవివాదాలపై ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం అక్రమార్కులకు వరంగా మారింది.