No Rains in Anantapur District: రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతలు, అడుగంటుతున్న జల వనరులు రైతులను వెంటాడుతున్నాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగుదామని ప్రయత్నించిన రైతులకు వెతలు తప్పటం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయల పంటలు నీటి ఎద్దడికి గురవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు.. విద్యుత్ కోతలు రైతులను సతమతం చేస్తున్నాయి. లోటు వర్షపాతం కారణంగా అనంతపురం జిల్లాలో 33 శాతం, సత్యసాయి జిల్లాలో 44 శాతం రైతులను కూరగాయల పంటల సాగుకు దూరం చేసింది. ప్రతియోటా జూన్ నెలాఖరు నుంచి కూరగాయల సాగు ప్రారంభించే రైతులు.. వాతావరణ ముందస్తు హెచ్చరికలతో వెనకడుగు వేస్తున్నారు.
Old Anantapur District Farmers Facing Water Stress Problems:సాహసంతో పంటలు సాగు చేయటానికి వచ్చిన రైతులకు వాతావరణ, విద్యుత్ కోతల వల్ల మొండి చేయే మిగులుతోంది. దాదాపు నెల రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతంలో చినుకు జాడ లేకుండా పోయింది. కొన్నిచోట్ల బోర్లు ఎండిపోగా, మరికొన్ని చోట్ల భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. విద్యుత్ సరఫరా సరిగా ఉండటం లేదు. పలు చోట్ల నిరంతరాయంగా కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండటం లేదని అన్నదాతలు ఆవేదనకు లోనవుతున్నారు.
వాతావరణంలో మార్పులు.. కూరగాయల రైతులకు తప్పని నష్టాలు
Crops Dying Due to Droughtనీటి తడి లేక పంటలు ఎండిపోతున్నాయి: నీటి ఎద్దడితో ఇప్పటికే చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసుకుంటున్నామని.. పంటలను రక్షించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నామని రైతులంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి.. పంటల పొలాలను తడుపుతూ పంటను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డీటీ సంస్థ కొన్ని గ్రామాల్లో నీటి ట్యాంకర్ల ద్వారా రైతులకు ఉచిత నీటి తడులను అందించి.. కొంతమేర ఆదుకుంటోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలు దాదాపు 2 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా.. అందులో 48 వేల హెక్టార్ల కూరగాయల పంటలు పండిస్తున్నారు. కూరగాయల సాగులో సింహభాగం టమాటా సాగు చేస్తున్నారు. తర్వాత బెండ, వంగ, ఉల్లి, చిక్కుడు, బీన్స్ వంటి తదితర పంటలను పండిస్తున్నారు. అంతేకాకుండా కూరగాయలతోపాటు కొందరు రైతులు ఆకుకూరలను సైతం సాగు చేస్తున్నారు.