ఏటా అనంతపురం జిల్లాలో రబీలో లక్ష హెక్టార్లలో పప్పుశనగ సాగవుతోంది. సుమారు 75 వేల క్వింటాళ్ల విత్తు అవసరం ఉంది. గతంలో అవసరం మేరకు పంపిణీ చేసేవారు. ఈసారి రాయితీ, కేటాయింపులు తగ్గించేశారు. దీంతో గోదాముల నుంచి నిల్వలు కదల్లేదు. గ్రామ, మండల గోదాముల నుంచి పప్పుశనగ బస్తాలను తెచ్చుకునేందుకు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
నిబంధనలతో బేజారు
రాయితీ ధరతో పప్పుశనగ విత్తనం పొందాలంటే తొలుత రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. పలు పత్రాలు సమర్పించాలి. అందులో ఏ మాత్రం తేడా ఉన్నా నిబంధనలు అడ్డుతగులుతున్నాయి. మరోసారి విత్తనం కోసం ఆర్‌బీకేలకు వెళ్లాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపే పొలంలో తేమ ఆరుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే విత్తు కోసం ఎదురుచూడకుండా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు.
ధరల్లో తేడా లేదు
రాష్ట్ర ప్రభుత్వం పప్పుశనగ విత్తనానికి 40 శాతం నుంచి 30 శాతానికి రాయితీ తగ్గించింది. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాల్ ధర రూ.7,500. అందులో రాయితీ రూ.2,250 పోగా.. రైతు వాటా రూ.5,250 చెల్లిస్తున్నారు. అదే బహిరంగ మార్కెట్లో క్వింటాల్ ధర రూ.5,200-5,300 పలుకుతోంది. రాయితీతో పెద్దగా ప్రయోజనం లేదని రైతులు విమర్శిస్తున్నారు.