ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటకెక్కిన అమృత్‌ పథకం.. పట్టణాల్లో తీరని దాహార్తి - amruth scheme at ananthapur latest news

అనంతపురం జిల్లా నగర, పురపాలక సంఘాల్లో అమృత్‌ పథకం నిధుల లేమితో ఆగిపోయింది. తాగునీరు, వరదనీటి పారుదల వ్యవస్థ, మురుగునీటి నిర్వహణకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. పెద్ద మొత్తంలో బకాయిలు ఉండటంతో గుత్తేదారులు ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. పురపాలికల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

no funds for amruth scheme at ananthapur district
no funds for amruth scheme at ananthapur district

By

Published : Feb 24, 2021, 8:10 PM IST

అనంతపురం జిల్లా నగర, పురపాలక సంఘాల్లో అమృత్‌ పథకం కింద చేపడుతున్న తాగునీటి పథకాలు అటకెక్కాయి. నగరాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2017లో అమృత్‌ పథకం ప్రవేశపెట్టింది. ఆయా మున్సిపాలిటీల్లో తాగునీరు, వరదనీటి పారుదల వ్యవస్థ, మురుగునీటి నిర్వహణకు పెద్దపీట వేసింది. జిల్లాలో అనంతపురం, హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు అమృత్‌ పట్టణాలుగా ఎంపికయ్యాయి. వీటిల్లో తాగునీటి సరఫరా మెరుగు కోసం 2017లో టెండర్లు నిర్వహించారు. హిందూపురంలో మాత్రమే 96 శాతం పనులు పూర్తి చేసి కొంతవరకు నీరు అందిస్తున్నారు. మిగతా పట్టణాల్లో అరకొరగా పనులు చేశారు. ప్రస్తుతం నిధుల లేమితో అమృత్‌ పథకం ఆగిపోయింది. ప్రభుత్వం స్పందిస్తేనే పథకం సాగుతుంది. లేదంటే పుర ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవు.

బిల్లుల బకాయిలే కారణం

గుత్తేదారులు చేసిన పనికి కూడా బిల్లులు చెల్లించలేదు. పెద్ద మొత్తంలో బకాయిలున్నాయి. దీంతో గుత్తేదారులు ఎక్కడికక్కడ పనులు నిలిపేశారు. బకాయిలతోపాటు అదనంగా నిధులు విడుదల చేయాల్సి ఉంది. నగరంలో చేపట్టాల్సిన పనులకు రూ.4.03 కోట్లు, గుంతకల్లు రూ.92 లక్షలు, తాడిపత్రి రూ.33.6 కోట్లు, హిందూపురం రూ.11.41 కోట్లు అవసరర ఉంది. అలాగే అన్ని మున్సిపాలిటీలు కలిపి రూ.21.19 కోట్ల బకాయిలున్నాయి.

  • అనంతపురానికి రూ.15.35 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో నీటిశుద్ధి కేంద్రం, 5 కి.మీ. పైపులైన్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.10.75 కోట్లు ఖర్చు చేసి, 74 శాతం పనులు పూర్తి చేశారు.
  • గుంతకల్లుకు రూ.10.98 కోట్లు మంజూరైంది. నీటిశుద్ధి కేంద్రం, పైపులైన్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 72 శాతం పనులు పూర్తి చేశారు. రూ.5.2 కోట్లు వెచ్చించారు.
  • తాడిపత్రికి రూ.145 కోట్లు కేటాయించారు. దీంతో గండికోట నుంచి తాడిపత్రి వరకూ పైపులైను, ట్యాంకులు, నీటిశుద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టారు. ఇప్పటిదాకా 60 శాతం పనులు చేశారు. రూ.65.41 కోట్లు ఖర్చు పెట్టారు.
  • హిందూపురానికి రూ.194 కోట్లు మంజూరు కాగా.. గొల్లపల్లి నుంచి హిందూపురం వరకూ పైపులైను వేశారు. 96 శాతం పనులు పూర్తి చేసి, రూ.128 కోట్లు వెచ్చించారు.
  • ధర్మవరానికి రూ.11.18 కోట్లు కేటాయించారు. పైపులైను, ట్యాంకుల నిర్మాణం చేపట్ట్లాల్సి ఉంది. కేవలం రూ.20 లక్షలు ఖర్చు చేసి 10 శాతం మేర పనులు పూర్తి చేశారు.
  • అనంత నగరపాలక సంస్థకు అమృత్‌ పథకం కింద రూ.82 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అందులో నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ.15.35 కోట్లతో టెండర్లు నిర్వహించారు. 2017 డిసెంబరు 28న గుత్తేదారుడు ఒప్పందం చేసుకున్నారు. 74 శాతం పనులు పూర్తి చేశారు. ఏడాది నుంచి పనులు ఆపేశారు.

హిందూపురం పట్టణం :

తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల, ఉద్యానవనాల అభివృద్దికి హిందూపురానికి నిధులు మంజూరు చేసింది. ఉద్యానాల నిర్మాణంలో పూర్తిగా వెనుకబడ్డారు. డి.బి. కాలనీ, డి.ఆర్‌.కాలనీల్లోని రెండు ఉద్యానాల అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు రూ.15 కోట్లు నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయారు.

తాడిపత్రి పట్టణం:

తాడిపత్రి పుర ప్రజలకు నిత్యం తాగునీరు అందించేందుకు అమృత్‌ పథకం ద్వారా గండికోట నుంచి పైపులైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించింది. నిధులు అందకపోవడంతో రెండేళ్ల కిందటే పనులను ఆపేశారు. ప్రస్తుతం పుర ప్రజలకు తాగునీరు జేసీనాగిరెడ్డి, పెన్నానదిలో బోర్ల సాయంతో అరకొరగా అందిస్తున్నారు. గండికోట నుంచి పైపులైను, సజ్జలదిన్నె వద్ద పంపు హౌస్‌, పట్టణంలో ఏడు ట్యాంకుల నిర్మాణం చేపట్టగా.. 60 శాతం కూడా పూర్తికాని పరిస్థితి.

పనులు చేయాలని నోటీసులిచ్చాం

బిల్లులు పెండింగ్‌లో ఉన్న సంగతి వాస్తవమే. పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు నోటీసులిచ్చాం. బిల్లులు చెల్లిస్తే పనులు చేపడతామని గుత్తేదారులు చెబుతున్నారు. నిధులు సమకూరిన వెంటనే పూర్తి చేయిస్తాం. - సతీష్‌చంద్ర, ఈఈ, పబ్లిక్‌హెల్త్‌శాఖ


ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి స్వర్ణ శంఖుచక్రాలు బహూకరణ

ABOUT THE AUTHOR

...view details