అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొత్తకోట శివాలయం ఆవరణలో నిద్రిస్తున్న ముగ్గురిని కిరాతకంగా హత్యచేసి నాలుగు రోజులు గడుస్తున్నా... నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు. గుప్త నిధుల అన్వేషణే కాక, ఇతర అంశాలపై దృష్టిసారించిన పోలీసులు... భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి కొత్తకోట పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. హతుల్లో ఒకరైన శివరామిరెడ్డికి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని, అవే హత్యకు దారితీసి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన స్వగ్రామమైన తంబళ్లపల్లితోపాటు తనకల్లు మండలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేయింబవళ్లు పోలీసుల గస్తీతో కొత్తకోట వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామంలోని వీధులన్నీ వెలవెలబోతున్నాయి. సందడిగా ఉండే బస్టాండ్ ప్రాంగణం బోసి పోయింది. నిందితుల కోసం ఏర్పాటు చేసిన బృందాలు... అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
కొత్తకోట మిస్టరీ... ఆ ముగ్గురినీ హతమార్చింది ఎవరో! - శివరామిరెడ్డి
కొత్తకోట శివాలయం ఆవరణలో ముగ్గురి హత్య కలకలం రేపింది. పోలీసులకు ఇదో సవాల్‌గా మారింది. గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీఎస్పీ శ్రీనివాసులు చెబుతున్నప్పటికీ... కేసు ఛేదనలో నిర్లక్ష్యం కనిపిస్తోందనే భావన వ్యక్తమవుతోంది.
కొలిక్కిరాని కొత్తకోటలోని హత్య కేసు