భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అనంతపురం జిల్లాలో పర్యటించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. గుత్తి మండలం కరడికొండలో దెబ్బతిన్న వేరుశనగ పంటను లోకేశ్ పరిశీలించారు. అనంతరం తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్లిన లోకేశ్‌కు... పాడైపోయిన పంటల వివరాలను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. పెద్దవడుగూరు మండలం మిడ్తూరులో వర్షంతో దెబ్బతిన్న పత్తి పంటను లోకేశ్ పరిశీలించారు. మోకాళ్ల లోతు బురదలో దిగి రైతులతో మాట్లాడుతున్నారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నారా లోకేశ్. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఏఒక్కటీ అమలు చేయట్లేదని....17 నెలలుగా రైతులకు ఎలాంటి రాయితీలు ఇవ్వట్లేదని లోకేశ్ ఆరోపించారు. పంట నష్టపోయిన అన్నదాతలను అవమానించేలా యంత్రాంగం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.