ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల తొలి దశ: జిల్లాలో ముగిసిన నామినేషన్లు - అనంతపురం ముఖ్యాంశాలు

అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం ముగిసింది. చివరిరోజు నామపత్రాల సమర్పణ అన్ని మండలాల్లో సందడిగా సాగింది. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీ నామినేషన్లు వేశారు.

రాత్రి 10.45 గంటల సమయంలో నామినేషన్‌ దాఖలుకు వేచిఉన్న  గసికవారిపల్లి గ్రామస్థులు
రాత్రి 10.45 గంటల సమయంలో నామినేషన్‌ దాఖలుకు వేచిఉన్న గసికవారిపల్లి గ్రామస్థులు

By

Published : Feb 1, 2021, 12:44 PM IST

● సర్పంచి స్థానాలు 169.. నామపత్రాలు 1095

● రాత్రి 9:30 గంటల వరకు స్వీకరణ

● బుక్కపట్నం, ఓడీసీ మండలాల్లో ఆలస్యంగా..

● తొలివిడత ఎన్నికల ప్రక్రియ

రాత్రి 10.45 గంటల సమయంలో నామినేషన్‌ దాఖలుకు వేచిఉన్న

గసికవారిపల్లి గ్రామస్థులు

అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం ముగిసింది. చివరిరోజు నామపత్రాల సమర్పణ అన్ని మండలాల్లో సందడిగా సాగింది. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీ నామినేషన్లు వేశారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరగనున్నా.. వైకాపా, తెదేపా మద్దతుదారులే ఎక్కువ సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు. తెరవెనుక ఆయా పార్టీల శ్రేణులు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏకగ్రీవాల సంఖ్య తగ్గిపోయింది.

కొత్త పంచాయతీ ఏకగ్రీవం

నల్లమాడ మండలం కొండకిందతండా పంచాయతీ సర్పంచి స్థానం ఏకగ్రీవం అయ్యింది. ఈ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. వైకాపా మద్దతుదారుగా పార్వతీబాయి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆదివారం గడువు ముగిసేసమయానికి మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవానికి మార్గం సుగమమమైంది. వేళ్లమద్ది పంచాయతీ నుంచి ఇది విడిగా ఏర్పడింది.ఈ పంచాయతీలో 335 మంది ఓటర్లున్నారు. ఎనిమిది వార్డులున్నాయి.

సర్పంచి అభ్యర్థి భర్త అపపహరణ

తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు

రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తెదేపా మద్దతుదారుడు, బీఎన్‌హళ్లి పంచాయతీ సర్పంచి అభ్యర్థి తిమ్మక్క భర్త ఈరన్నను శనివారం కిడ్నాప్‌ చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామస్థులు, బాధితుడి వివరాలు మేరకు.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే ఈరన్న తన భార్య పేరిట సర్పంచి పదవికి నామినేషన్‌ వేయాలని మంచి సమయం చూపించుకునేందుకు జనవరి 30న రాయదుర్గంలోని పండితుని వద్దకు వచ్చారు. అక్కడి నుంచి బస్సులో బయల్దేరి కర్ణాటకలోని మొలకాల్మూరులో దిగారు. అడవి మారెంపల్లిలోని ఇంటి దేవుడ్ని దర్శించుకునేందుకు బస్టాండులో బస్సు కోసం వేచి ఉండగా కారులో వచ్చిన కొందరు ఆయన్ను వాహనంలోకి నెట్టి డోర్‌ వేసేశారు. నామినేషన్‌పై ప్రశ్నించగా తన భార్య వేస్తారని సమాధానం ఇవ్వటంతో కొట్టారు. మూడు రోజులు బంధించిన అనంతరం చంపేస్తామని కత్తులతో బెదిరించి మత్తుమందు వాసన చూపటంతో స్పృహ కోల్పోయారు. అడవిలోకి తీసుకెళ్లి చితకబాదారు.

మధ్యాహ్నం మెలకువ రావటంతో వెనుక సీటులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బిర్యానీ తింటూ ఆయనకూ ఇచ్చారు. నీళ్లడిగితే మద్యాన్ని బలవంతంగా తాగించారు. బహిర్భూమికి వెళ్లాలని డ్రైవర్‌ను బతిమాలడంతో వెంటవచ్చాడు. ఫోన్‌ మాట్లాడేందుకు పక్కకు వెళ్లడంతో అడవిలో నుంచి పరుగులు తీసి చీకటిపడిన అనంతరం సమీపంలోని తిమ్మాపురం వెళ్లి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఆయన్ను బొమ్మక్కపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి అండదండలతో తనను కిడ్నాప్‌ చేసి చంపాలని ప్రయత్నించారని బాధితుడు పేర్కొన్నారు. తెదేపా నాయకులతో కలిసి రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

బాధితుడికి చంద్రబాబు పరామర్శ...

ఈరన్నను తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదివారం నాయకులతో కలిసి గ్రామానికి వెళ్లి పరామర్శించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చరవాణిలో పరామర్శించారు. తెదేపా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భయపడాల్సిన పనిలేదన్నారు.

ముహూర్తం.. ఆలస్యం

అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగదన్నది సామెత. పంచాయతీ ఎన్నికల పోటీ చేసేందుకు కొందరు అభ్యర్థులు ముహూర్తం చూసుకుని మరీ ఆలస్యంగా ఇంటి నుంచి బయల్దేరారు. మధ్యాహ్నం 3.30కి బయల్దేరి 4.30కి నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చినా అభ్యర్థిత్వాలను అధికారులు తీసుకోక తప్పలేదు. బుక్కపట్నం మండలం గసికవారిపల్లికి చెందిన తొమ్మిది మంది వల్ల అధికారులకు ఎదురైన అవస్థ ఇది. దీంతో బుక్కపట్నంలో పొద్దుపోయే వరకు అధికారులు పనిచేయాల్సి వచ్చింది.

ఇదీ చదవండి:

నిర్మల నయా ట్రెండ్​- 'ట్యాబ్'​తో బడ్జెట్​

ABOUT THE AUTHOR

...view details