అనంతపురం జిల్లాలో చాలా గ్రామాల్లో రాజులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. నిర్మాణ సమయంలో అంతర్భాగంలో నిధులు ఉంచి ఉంటారనే అభిప్రాయం బలంగా ఉంది. కొంత మంది స్వార్థపరులు శిథిలావస్థకు చేరిన ఆలయాలపై కన్నేసి తవ్వేస్తున్నారు. ముఠాలుగా ఏర్పడి కట్టడాలు ధ్వంసం చేస్తున్నారు. నిధులు దొరకుతున్నాయని ప్రచారంతో మరికొందరు ఈ పనికి పూనుకుంటున్నారు. ఈ నిధుల కోసం అన్వేషించేటప్పుడు నరబలి ఇవ్వాలని కొందరి నమ్మకం. అందుకే ఇలాంటి హత్యలు ఇక్కడ నిత్యం కనిపిస్తున్నాయి.
నర బలికి కొందరి ప్రాణాలు పోతుంటే... వాటాలు ఇవ్వాల్సి వస్తుందనే దురాశతో ఇంకొన్ని హత్యలు జరుగుతున్నాయి. ఇలానే పెనుకొండలో రాయల రెండో రాజధానిని గుప్తనిధుల వేటగాళ్లు ధ్వంసం చేశారు. గుత్తికోట, రాయదుర్గం, ఉరవకొండ, మడకశిర, లేపాక్షి తదితర ప్రాంతాల్లోనే ఎన్నో కట్టడాలు నేలకూల్చారు.
కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం కొర్తికోట గ్రామ శివాలయంలో జరిగిన మూడు హత్యలు అందర్నీ భయాందోళనకు గురి చేశాయి. శివాలయానికి పూజారిగా ఉన్న శివరామిరెడ్డి అతని సోదరి కమలమ్మ, మరో సమీప బంధువు సత్యలక్ష్మిని గొంతు కోసి చంపేశారు.