ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంచనాలు తారుమారు.. బరిలో నిలిచేదెవరు!

ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయటంతో జిల్లాలో పుర పోరు మొదలైంది. గత ఏడాది వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు తెరపైకి రావటంతో... ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటివరకూ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మగ్నమైన నేతలు... పుర పోరులోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు బరిలో ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ap mumcipal elections 2021
ap mumcipal elections 2021

By

Published : Feb 19, 2021, 11:53 AM IST

వాయిదా పడిన పురపాలక ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు 11 నెలల తర్వాత తెరపైకి వచ్చింది. గత మార్చిలో జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికలకు కరోనా ఆడ్డంకిగా నిలిచింది. నామపత్రాల స్వీకరణ పూర్తయిన తరువాత వాయిదా పడ్డాయి. అప్పట్లో నగర మేయర్‌, మున్సిపల్‌ ఛైర్మన్ల పీీఠాల కోసం వైకాపా, తెదేపా నేతలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఎన్నికలు వాయిదా అనగానే అంతా నిశబ్దం. ఒక్కసారిగా ఎన్నికల ప్రకటన రావడంతో ప్రధాన పార్టీల్లో సమీకరణాలు మొదలయ్యాయి. ఆశావహులు, నాయకుల అంచనాలు తారుమారవుతున్నాయి. అప్పట్లో పీీఠం ఆశించిన వారిలో కొందరు స్థబ్దుగా ఉన్నారు. మరికొందరు పార్టీ మారారు. ఇంకొందరు అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకొంటున్నారు. కొత్త ముఖాలు తెరపైకొస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిమగ్నమైన ఎమ్మెల్యేలు పురపాలికలపై దృష్టిపెట్టారు.

పురపాలికల్లో ఇదీ తీరు..

హిందూపురం

అనంతపురం తరువాత జిల్లాలో హిందూపురం ప్రధాన పురపాలక సంఘం. హిందూపురం ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21న జరుగుతుండటంతో అక్కడ నాయకులంతా గ్రామాలపై ఎక్కువగా దృష్టిసారించారు. వైకాపా తరఫున భారతిరెడ్డి, బలరామిరెడ్డి, తెలుగుదేశం తరఫున వెంకటస్వామి బరిలో ఉన్నారు. వైకాపా నేతలు సమీకరణలు ప్రారంభించారు. హిందూపురం జనరల్‌కు కేటాయించారు. దీంతో పోటీ కూడా ఎక్కువగానే ఉంది.

కదిరి

పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ కల్పించారు. వైకాపాకు చెందిన ఇద్దరు మైనార్టీ మహిళలు తమ నామపత్రాల్లోనే అర్హత కోల్పోయారు. వైకాపా, తెదేపా రెండు పార్టీలు మైనార్టీలకు ఛైర్మన్‌ అవకాశం కల్పించేందుకు వ్యూహం రచిస్తున్నారు.

ధర్మవరం

అధ్యక్ష స్థానం బీసీ మహిళకు కేటాయించారు. అక్కడ 40 వార్డులు ఉండగా 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 4 వార్డులు ఏకగ్రీవమవుతాయని సమాచారం. ధర్మవరంలో అనేక వార్డుల్లో పోటీ తక్కువగా ఉంది.

తాడిపత్రి

మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి అన్‌రిజర్వులో ఉంది. దీంతో తాజా, మాజీ ఎమ్మెల్యేలు తమ వారసులను బరిలో నిలిపారు. వైకాపాలో మరో కీలకమైన నేత ఎమ్మెల్యే టికెట్టు ఆశించి విఫలమయ్యారు. ఆయన ఛైర్మన్‌ గిరి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బరిలో ఎవరున్నా ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది.

గుంతకల్లు

ఇక్కడ ఎమ్మెల్యే కుమార్తె నైరుతి తెరపైకొచ్చారు. అదే పార్టీకి చెందిన మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ సతీమణి భవాని కూడా ఛైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. తెలుగుదేశం తరఫున జిల్లా పరిషత్తు మాజీ ఛైర్మన్‌ భార్య అనురాధ, మాజీ ఎమ్మెల్యే సతీమణి వెంకటలక్ష్మి ఛైర్మన్‌ స్థానం కోసం పోటీ పడుతున్నారు.

రాయదుర్గం

వైకాపా తరఫున నలుగురు ఛైర్మన్‌ పదవి కోసం బరిలో ఉన్నారు. తెదేపా తరఫున ఇద్దరున్నారు. అక్కడ ఇరుపార్టీల నుంచి కుటుంబ సభ్యులతో కూడా నామపత్రాలు దాఖలు చేయించారు.

పుట్టపర్తి

ఛైర్మన్‌కి వైకాపా తరఫున పోటీ పడుతున్న ఇద్దరు కీలక నేతలు ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగు దేశం తరఫున ఒకే వ్యక్తిపేరు వినిపిస్తోంది.

కళ్యాణదుర్గం

ఛైర్మన్‌ బరిలో ఉన్న వైకాపా అభ్యర్థి సూర్యనారాయణరెడ్డి ఇటీవల మరణించారు. దీంతో మరో ఇద్దరు నేతలు తెరపైకొచ్చారు. అక్కడ జనరల్‌కు కేటాయించినా ఆ ఇద్దరు నేతలు తమ సతీమణులను బరిలో నిలిపారు. తెదేపా నాయకులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.

నగరం.. కీలకం

అనంత నగరపాలక సంస్థలో మేయర్‌ పీఠం కీలకం. ఛైర్మన్ల కంటే మేయర్‌కు హోదాకు ప్రాధాన్యం ఎక్కువ. దీంతో మేయర్‌ పదవిని ఆశించేవారూ ఎక్కువే. అధికార పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కని వారు, మేయర్‌ పదవిపై కన్నేశారు. ఇద్దరు కీలకమైన నేతలు మేయర్‌ పీఠం కోసం సర్వప్రయత్నాలు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు రావడంతో ఆ పదవిపై సన్నగిల్లారు. ఓ నేత తన నామపత్రాన్ని కూడా ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ మాజీ కార్పొరేటరు మేయర్‌ రేసులో ఉన్నారు. ఆయన ఇటీవల వైకాపాలో చేరారు. ఆయనకు వైకాపా తరఫున బి.ఫాం దక్కుతుందా? లేదా? అని చర్చ సాగుతోంది. వైకాపా తరఫున మైనార్టీకి చెందిన ఓ అభ్యర్థి తెరపైకొచ్చారు.

ఇదీ చదవండి:

'గల్వాన్​' మృతులపై తొలిసారి చైనా ప్రకటన

ABOUT THE AUTHOR

...view details